జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23 : ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రానున్నది. పాఠశాలల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం, విద్యుత్ సరఫరాతోపాటు విద్యార్థులకు బెంచీలు, టేబుల్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. తరగతి గదులను సుందరంగా తీర్చిదిద్ది.. భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేయనున్నారు..
ఆడుకోవడానికి క్రీడా పరికరాలు అందజేసి.. విరివిగా మొక్కలు పెంచి.. పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించనున్నారు. ఇందుకుగానూ ఖైరతాబాద్ మండల విద్యాశాఖ అధికారులు తొలి విడుత 16 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1.26 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో తొలి ప్రాధాన్యాలను బట్టి 16 పాఠశాలల్లో పనులు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు డిప్యూటీ డీఈవో చిరంజీవి, డిప్యూటీ ఐవోఎస్ రామలింగయ్య ఆధ్వర్యంలో రూ. 1.26 కోట్లతో సిద్ధం చేసిన ప్రతిపాదనలను విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు అందజేశారు.
ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి రూ.2కోట్లు ఇస్తున్నాం..
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు తొలి విడుత రూ.1.26 కోట్లతో పనులు చేపట్టనున్నాం. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాలలను అందుకు తగ్గట్టుగా తీర్చిదిద్దనున్నాము. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి రూ.2 కోట్లు ఇస్తున్నాం. – ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్