ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 23: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే జాతీయ స్థాయి ఫెలోషిప్లను తగ్గించారని ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ మండిపడ్డారు. యూజీసీ ఇచ్చే ఫెలోషిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ.. జేఆర్ఎఫ్, ఆర్‌జీఎన్‌ఎఫ్, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ తదితర ఫెలోషిప్‌ల సంఖ్యను విపరీతంగా తగ్గించారని దుయ్యబట్టారు. దీనిమూలంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, సామాజిక విద్యార్థులకు ఆర్జీఎన్ఎఫ్లో నెట్‌ను తప్పనిసరి చేశారని గుర్తు చేశారు.
ఇటీవల విడుదల చేసిన యూజీసీ – నెట్ పరీక్షలో అన్ని సబ్జెక్టులలో స్లాట్లను తగ్గించారన్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ విద్యావిధానాన్ని సక్రమంగా అమలు చేయకుండా, నూతన విద్యావిధానం ముసుగులో పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కరణ్, విజయ్‌నాయక్, ఆంజనేయులు, సాయికిరణ్, రమ్య, మహాల్లా, శివాని, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.