సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విడుదల చేసిన 58, 59 జీవో ప్రకారం ప్రభుత్వ భూములు రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు సంబంధించి సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. గతంలోలా మొదట 12.5 శాతం రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం రూ. వెయ్యి చెల్లిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. అన్ని కూడా పాత జీవోల ప్రకారమే నిబంధనలు అమలు పరుస్తునారు.
అందులో భాగంగా జూన్ 2, 2014 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. అంటే అంతకంటే ముందుగా ప్రభుత్వ భూములలో ఇండ్లు కట్టుకున్న వారి భూములను మాత్రమే క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలు పెట్టారు. ఆ కటాఫ్ తేదీ తర్వాత నివాసాలు ఉన్న దరఖాస్తులకు అనుమతి ఉండదని హైదరాబాద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. భూములు రెగ్యులరైజేషన్‌కు తొలి రోజు రావడం వల్ల ఆన్లైన్ దరఖాస్తుల స్వల్పంగానే వచ్చాయన్నారు. అయితే దరఖాస్తు దారులకు పలు సందేహాలు ఉండడం వల్ల అందుకు సంబంధించి వారు విచారణ చేస్తున్నారన్నారు.
ఇతర శాఖలు, కార్పొరేషన్లు,ఇనిస్టిట్యూషన్లకు చెందిన భూములకూ వర్తింపు
గతంలో విడుదల చేసిన జీవో 58, 59 ప్రకారం అన్ని నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ అదనంగా మరో నిబంధన కూడా ఉంది. గతంలో కేవలం ప్రభుత్వ అసైన్డ్ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాటికి మాత్రమే రెగ్యులరైజేషన్ విధానం ఉండేది. కాని ఇప్పుడు అదనంగా అసైన్డ్ భూములతో పాటు జీహెచ్ఎంసీ, హౌజింగ్‌బోర్డు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, హెచ్ఎండబ్లూఎస్, నాన్ ఐఎస్ఎఫ్ వంటి డిపార్టుమెంట్లు, కార్పొరేషన్లు, ఇనిస్టిట్యూషన్‌లో కబ్జాలకు గురైన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారి భూమలు కూడా రెగ్యులరైజ్ చేయడానికి దరఖాస్తుదారులకు అవకాశం కల్పించినట్లు ఆర్డీవో తెలిపారు.
అయితే దానికి కూడా 2014 జూన్ 2, కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లుగా తెలిపారు. కరెంట్ బిల్లు, ఆధార్‌కార్డు వంటి ఆధారాలు తప్పకుండా దరఖాస్తులతో పాటు జత చేయాలన్నారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలు రాలేదని, ఒకటి రెండు రోజులలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పూర్తి స్థాయి నిబంధనలు తెలుసుకున్న తర్వాత రెగ్యులరేజేషన్ కోసం దరఖాస్తుల చేసుకోవాలన్నారు.