సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : ప్రజా రవాణా భద్రత చర్యల్లో భాగంగా నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడం, ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా పాదచారులు రోడ్డు దాటేలా.. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ సహకారంతో వివిధ జంక్షన్ల వద్ద పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రద్దీ సమయంలో పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా.. చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అత్యంత రద్దీగా ఉండే చైతన్యపురి, అష్టలక్ష్మి దేవాలయం రోడ్డులో పెలికాన్ సిగ్నల్‌ను ఏర్పాటు చేశారు.
40 సెకండ్లకోసారి..!
పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్స్ వాటంతట అవే పనిచేస్తాయి. ఈ సిగ్నల్ ప్రతి 40 సెకండ్లకు ఓ సారి.. 15 నిమిషాల పాటు పడుతుంది. ఈ సమయంలో పాదచారులు రోడ్డు దాటే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అష్టలక్ష్మి దేవాలయం వద్ద ప్రతి రోజు 300 మంది పాదచారులు సిగ్నల్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. త్వరలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మరో 10చోట్ల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పెలికాన్ సిగ్నల్ దాటినా చలాన్..
పాదచారులు సురక్షితంగా రోడ్డును దాటేందుకు ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్‌ను వాహనదారులు దాటితే చలాన్ విధిస్తామని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. దీన్ని సిగ్నల్ జంపింగ్ కింద పరిగణిస్తామని తెలిపారు. పెలికాన్ సిగ్నల్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.