సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాలను నియంత్రించేందుకు దర్యాప్తు వ్యూహాలను పునర్ వ్యవస్థీకరిస్తూ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సమర్థవంతంగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ స్టేషన్)లోని సీసీఎస్, సైబర్‌క్రైమ్స్, మహిళా పోలీస్‌స్టేషన్, జాయింట్ సీపీ, అదనపు సీపీ కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం ఆయా విభాగాల పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న మహిళలకు సంబంధించిన కేసులను వెంటనే సమీక్షించాలన్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో మరింత సమర్థవంతంగా దర్యాప్తు చేసేలా.. ఠాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
అత్యవసరమైతే తప్ప.. సీసీఎస్ సిబ్బందికి ఇతర విధులు కేటాయించరాదని అధికారులకు సూచించారు. సీసీఎస్‌కు కావాల్సిన వనరులు, వాహనాల కేటాయింపునకు తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సిబ్బంది పనితీరు పారదర్శకంగా ఉండాలని, దర్యాప్తునకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే జోనల్ క్రైమ్ టీమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. సీపీ వెంట అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ గజరావు భూపాల్, తదితరులు పాల్గొన్నారు.