శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 21 : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి సుమారు రూ.11లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో నివాసముండే విజయ్‌కుమార్ (42) గత కొంతకాలంగా ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని ‘క్రికెట్ మజా, క్రికెట్ బజ్, లైవ్‌లైన్ గురు’ తదితర పేర్లతో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
ఆదివారం రాత్రి భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు జరిపారు. ప్రధాన నిందితుడు విజయ్‌ని శంషాబాద్‌లోని పుల్లారెడ్డి స్వీట్హౌజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.10లక్షల 9వేలు, 14 ఫోన్లు, (కిప్యాడ్ ఫోన్లు 11, స్మాట్ఫోన్లు 3), నోట్‌బుక్ 1, టీవీ, ద్విచక్ర వాహనం మొత్తం 11.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు కపిల్, అనిల్, శశి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ భాస్కర్‌గౌడ్, సీఐ విజయ్‌కుమార్, ఎన్వోటీ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ రవి ఉన్నారు.