అమీర్‌పేట్, ఫిబ్రవరి 21 : ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్నగర్, బీకేగూడలోని నివాసితుల సంక్షేమ సంఘాలను కలుపుకుని ఫ్రాబ్స్ (ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఇన్ బీకేగూడ, ఎస్ఆర్నగర్, సనత్‌నగర్) సంస్థ చేసిన కృషి అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
ఫ్రాబ్స్ సంస్థ తన పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి, సామాజిక సమస్యలపై ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యాన్ని వివరిస్తూ రూపొందించిన సావనీర్‌ను సోమవారం ఉదయం మంత్రి తలసాని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, ఫ్రాబ్స్ అధ్యక్షుడు ఆర్.పి.కుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ భూగర్భనీటి పరిరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాట్లు, పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రభావం, పారిశుద్ధ్య నిర్వాహణలో పౌరుల బాధ్యత, దేవాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టిన సంస్థ అధ్యక్షుడు ఆర్.సి.కుమార్‌తో పాటు ప్రతినిధులను అభినందించారు.
వీటితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా ఫ్రాబ్స్ చొరవ చూపడం ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫ్రాబ్స్ అధ్యక్షులు ఆర్.సి.కుమార్ మాట్లాడుతూ .. మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రాబ్స్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.