జూబ్లీహిల్స్,ఫిబ్రవరి : సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్’ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ సూచించారు. ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే ఈ వాహనంలో వచ్చి బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. సోమవారం శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో 60 ఏండ్లు దాటిన వృద్ధులకు జీహెచ్ఎంసీ వాహనంలో ఇంటివద్దకు వెళ్ళి బూస్టర్ టీకాలు ఇచ్చారు.
మొదటి, రెండు డోస్‌లు తీసుకుని 90 రోజులు పూర్తైన సీనియర్ సిటిజన్లు విధిగా బూస్టర్ డోస్ వేయించుకోవాలన్నారు. ఇందుకుగానూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ సర్కిల్ డీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్రిత ఆధ్వర్యంలో ఏఎన్ఎం వసంతకుమారి, సిబ్బంది వైద్య సేవలందించారు.