బంజారాహిల్స్,ఫిబ్రవరి 21: బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 5లోని దేవరకొండ బస్తీలో మురుగు సమస్యను పరిష్కరించాలని స్థానిక అరుంధతి వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ నేతలు సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కోరారు. బస్తీలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మురుగు కాలువతో తరచూ మురుగు ఆలయంలోకి వస్తోందన్నారు. త్వరలో నాలా అభివృద్ధి పనులు చేపట్టి మురుగు సమస్య లేకుండా చూడాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే దానం నాగేందర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండబస్తీ పంచాయతీ కమిటీ అధ్యక్షుడు కొండ్రపల్లి రఘునాథ్, ప్రధాన కార్యదర్శి మన్నెం వీరాస్వామి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.