సికింద్రాబాద్, ఫిబ్రవరి 21: రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు మడ్‌ఫోర్ట్ గాంధీనగర్, శ్రీరాంనగర్‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద సోమవారం మంచినీటి పైపులైన్ నిర్మాణానికి సుమారు రూ.23.50లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ .. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల సంక్షేమం కోసం ఆసరా పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసి పింఛన్లు అందిస్తారని వివరించారు. బీజేపీ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అన్ని బస్తీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఆయా బస్తీలతో పాటు కాలనీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బోర్డుకు రావాల్సిన నిధులను రప్పించే దమ్ములేని నేతలు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్నివర్గాల అభ్యున్నతికి దేశంలో ఎక్కడాలేని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కంటోన్మెంట్ వాసులు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, శ్యామ్‌కుమార్, నళినికిరణ్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, మహంకాళి శర్విన్, ఆంజనేయులు, ముప్పిడి మధుకర్, సదానంద్‌గౌడ్, శ్రీకాంత్, శ్రీను, సురేశ్, రమేశ్‌తో పాటు స్థానిక బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.