సికింద్రాబాద్, ఫిబ్రవరి 21: సికింద్రాబాద్ పరిధిలో లాలాపేట, తుకారాంగేట్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నిధుల కొరత ఎదురుకాకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. లాలాపేటకు చెందిన నలుగురు రోడ్డు విస్తరణ బాధితులకు రూ..58 లక్షల మేరకు విలువ చేసే చెక్కులను సోమవారం డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి డిప్యూటీ స్పీకర్ సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. బాధితులకు పరిహారం చెల్లించే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టడం ద్వారా రోడ్డు విస్తరణ పనులు సాఫీగా సాగేలా ఏర్పాట్లు జరిపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, సునీత, డిప్యూటీ కమిషనర్ దశరథ్, టౌన్ ప్లానింగ్ అధికారి యమునతో సహా నేతలు తదితరులు పాల్గొన్నారు.