సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్ టూ జిరాక్స్, ఒకే డ్రెస్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు. తల్లిగర్భంలో ఒకే సారి, ఒకే రూపంతో మొదలై క్షణాల వ్యవధిలోనే బయటి ప్రపంచానికి పరిచయమై ఒకే ముఖకవలికలతో అందరినీ అమితంగా ఆకట్టుకుంటారు.అంతెందుకు పేర్లు కూడా రమేశ్, లకేశ్, గౌతిక్, గౌరిక్ లాంటి పేర్లతోనూ తికమక చేస్తుంటారు.అయితే నేడు ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో కవలలు, వారి తల్లిదండ్రులు పంచుకున్న విశేషాలు మీ కోసం..
ఎంతో అదృష్టవంతులం
కవలలు కడుపులో ఉన్నారని తెలిశాక మేం ఎంతో సంతోషించాం. ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలను కనడం ఎంతో అనుభూతినిచ్చింది. ఇద్దరి పేర్లను కూడా ఒకేలా గౌతిక్, గౌరిక్ పెట్టాం. చిన్నారులను చూసుకోవాలంటే తల్లిదండ్రులకు ఎంతో ఓపిక అవసరం. ఒకరికి పాలుపట్టి నిద్రపుచ్చగానే మరొకరు మేల్కొంటారు. అమ్మ లేదా అత్తమ్మ ఇట్లా ఎవరో ఒకరు తోడుంటేనే వారిని ఆడించడం, పాడించడం సాధ్యమవుతుంది. మా వారు బెంగళూరులో జాబ్ చేస్తారు. అక్కడికి వెళితే పిల్లలను చూసుకోవాలంటే ఇబ్బందవుతుందని మా అత్తగారి ఇంటి వద్దే ఉంటున్నాం. బంధువులు కూడా మా పిల్లల్ని చూసి ఎంతో ముచ్చటపడుతుంటారు. గుర్తు పట్టడం కాదుకదా.. ఇద్దరి పేర్లనూ పలకడానికి తడబడుతుంటారు. ఒక్కోసారి ఇంటికి వచ్చిన వారు తికమకపడుతుంటే మాకు నవ్వొచ్చేస్తుంది.
– శ్రీజ రమేశ్, లింగారావుపేట్, గౌతిక్, గౌరిక్ ,తల్లిదండ్రులు, తలకొండపల్లి, రంగారెడ్డి జిల్లా
నా గొంతు..అన్న గొంతు ఒకేలా..
నా పేరు లకేశ్. మా అన్న పేరు రమేశ్. ఇద్దరం కవలలం. చాలా సార్లు ఎంతో మంది ఇద్దరిని గుర్తుపట్టక పోయేవాళ్లు. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటాం. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ దవాఖానలో పనిచేస్తున్నాం. అయితే ఓ సారి మా అన్న రమేశ్‌కు జ్వరం వచ్చింది. దీంతో నేను వాళ్ల సార్‌కు ఫోన్ చేసి రమేశ్ వాళ్ల తమ్ముడిని మాట్లాడుతున్నాను, రమేశ్ జ్వరంతో దవాఖానలో చేరిండు అని చెప్పాను. ఏంటీ నాకు తెలువదనుకుంటున్నావా? నువ్వే మాట్లాడుతూ రమేశ్ వాళ్ల తమ్ముడిని అంటావా? అని వాళ్ల సార్ ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఒక నాడు వెళ్లి పరిస్థితి వివరిస్తే అప్పుడు వాళ్ల సారు ముక్కున వేలేకుకొన్నాడు. ఇవేకాకుండా చాలా సందర్భాల్లో మా స్నేహితులు లకేశ్ అనుకొని.. రమేశ్‌ను పలకరించినప్పుడు నోరెళ్లబెట్టిన తీరు ఇప్పటికీ ఒకింత ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఇప్పటికీ బంధువులు, స్నేహితులు నువ్వు లకేశ్వే కదా? అంటూ పలకరించినప్పుడల్లా నవ్వులే నవ్వులు.
– కమటం లకేశ్, రమేశ్ కవలలు, మల్కాజిగిరి
ఇద్దరం పోలీస్ శాఖలోనే..
ఎస్.శ్రద్ధాంత్ మోహన్, శశాంక్ మోహన్ ఇద్దర కవలలు. చిన్నప్పటి నుంచి వారు మంచిగా కలిసి ఉంటారు. పెద్దయ్యాక తెలంగాణ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించింది. వెంటనే దరఖాస్తు చేసుకోగా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. గమ్మత్తేమంటే మేం ఉద్యోగానికి వెళుతుంటే మమ్మల్ని చూసి మా కాలనీవాసులు గుర్తుపట్టక.. ఇద్దరికీ ఒకే సారి టాటా చెబుతుంటారు. అంతేకాదు తోటి పోలీసులు అప్పుడప్పుడూ ఒకరిని పిలువబోయి మరొకరిని పిలుస్తుంటారు.
-ఎస్.శ్రద్ధాంత్ మోహన్, శశాంక్ మోహన్, కవలలు,లాల్‌బజార్, సికింద్రాబాద్