ఖైరతాబాద్, ఫిబ్రవరి 20: మరో నెల రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. జరిమానాలు, జప్తుల నుంచి మినాహాయింపు పొందటంతో పాటు బకాయిలు చెల్లింపునకు జీహెచ్ఎంసీ సదావకాశాన్ని కల్పించింది.ఆదివారం నుంచి ఆస్తిపన్ను పరిష్కార వేదికను ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో ప్రారంభించింది. ఈ వేదిక ద్వారా ఆస్తిపన్నుల చెల్లింపుల్లో ఉన్న ఇబ్బందులు, డిమాండ్ కరెక్షన్, కొత్త అసెస్మెంట్స్, ఆస్తిపన్నుల్లో మినహాయింపులు, వెకెన్సీ రెమీషన్ తదితర అవకాశాలను కల్పించింది.
మార్చి 31 వరకే అవకాశం
ఖైరతాబాద్ సర్కిల్ 17 పరిధిలో మొత్తం 64,003 అసెస్మెంట్లు ఉండగా, రూ.133 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 42,835 అసెస్మెంట్లకు గాను రూ.110 కోట్లు పన్నుల రూపంలో వచ్చాయి. ఇంకా 21,168 అసెస్మెంట్స్ నుంచి పన్నులు రావాల్సి ఉంది. గతేడాది టార్గెట్ రూ.140 కోట్లు ఉండగా రూ.148 కోట్ల వసూళ్లు జరిగిన రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఏడాది అంతకు రెట్టింపుగా పన్నులు వసూలవుతాయని అధికారులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఆస్తిపన్ను పరిష్కార వేదికల్లో 15 మంది రాగా, ఏడు పిటీషన్లలో ఒకటి సమస్య పరిష్కారమైంది. డిమాండ్ కరెక్షన్స్ కోసం మూడు, కొత్త అసెస్మెంట్ ఒకటి, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపునకు ఒకటి, వెకెన్సీ రెమీషన్ కోసం రెండు దరఖాస్తులు వచ్చాయి.
గడువు దాటితే జరిమానాలు తప్పవు
ఆస్తిపన్నుల చెల్లింపునకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌తో పాటు నేరుగా ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలోనివినియోగదారుల సేవా కేంద్రానికి వచ్చి చెల్లించవచ్చు. అవసరమైతే బిల్ కలెక్టర్లు నేరుగా ఇంటి వద్దకు వచ్చి పన్నులు స్వీకరిస్తారు. పన్నుల చెల్లింపుల్లో ఉన్న అవాంతరాలను తొలగించేందుకు ఆస్తిపన్నుల పరిష్కారం వేదికను ప్రారంభించాం. ఇది మంచి అవకాశంగా భావించాలి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకొని చెల్లింపులు చేసుకోవచ్చు. వచ్చే నెల 6,13, 20,27 తేదీల్లో ఆదివారాలు ఈ వేదిక ఉంటుంది. మార్చి 31న చివరి తేదీ. ఆ గడువులోగా బకాయిలున్న వారు చెల్లించి జరిమానాలు,ఆస్తిజప్తుల నుంచి మినహాయింపు పొందాలి.
-వంశీకృష్ణ, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ 17