‘మామా నేను నీ దోస్త్‌ని రా..నాకు తెలుసు నీకేం కావాలో..వాడేస్కో వైఫై వాడేస్కో” అనే ట్యాగ్‌లైన్‌గా ‘తిందాం రా మామ’ పేరుతో దేశంలో తొలిసారి దేశీ స్నాక్ రెస్టారెంట్ మియాపూర్‌లో ఇటీవల ప్రారంభమైంది.
ఆకలిగా ఉందా? కడుపునిండా తినాలని ఉందా ? 50 రూపాయలకే భోజనం అంటూ ‘తిన్నంత భోజనం’ పేరుతో ఉప్పల్‌లో మరో హోటల్ కిటకిటలాడుతోంది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఉపాయం ఉండాలే కానీ ఆచరణ సాధ్యం కానిది ఏదీ లేదు. కాసింత కొత్తదనం, వెరైటీ, సృజన ప్రయోగిస్తే ఎలాంటి వ్యాపారంలోనైనా రాణించొచ్చు. ఇప్పటివరకు సాధారణ పేర్లతో నడిచే వ్యాపారాలకు భిన్నంగా వెరైటీ పేర్లు జోడించి యువత వ్యాపారంలో రాణిస్తున్నది. స్వయం ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యాపారం ప్రారంభించడం ఎంత ప్రధానమో.. దానికి పేర్లు పెట్టడం అంతే ప్రధానం. ఒక్కోసారి దుకాణం పేర్లు రూపాయి ఖర్చు లేకుండా విపరీత పబ్లిసిటీ అవుతుంటాయి. ఇలాంటి ట్రెండే ప్రస్తుతం నగరంలో జోరుగా సాగుతోంది.
క్యాచీ పేర్లు..అవే అంబాసిడర్లు
సాధారణ పేర్లకు భిన్నంగా కాసింత తెలివి ఉపయోగించి క్యాచీ పేర్లు పెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఒక్కసారి చదివితే ఎప్పటికీ గుర్తుండేలా నామకరణంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పదాలతో బోర్డులు పెట్టి వినియోగదారులను ఆకట్టుకోవడంలో సఫలమవుతున్నారు. పేరు చదవగానే వెళ్లాలనే ఆలోచన కలిగించేలా చేస్తున్నారు. అలాంటి వినూత్న పేర్లతో నగరంలో వేలాదిమందిని కొన్ని హోటళ్లు ఆకట్టుకుంటున్నాయి.
మచ్చుకు కొన్ని..
తిందాంరా మామ, తిన్నంత భోజనం, పాలమూరు గ్రిల్స్, వివాహ భోజనంబు, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ భోజనం, రాయలసీమ రుచులు, తెలుగు నెస్, తెలుగింటి రుచులు, వియ్యాల వారి విందు, మాయాబజార్, విలేజ్ ఆహారం, రాజుగారి రుచులు, కోడికూర చిట్టిగారే, రాజుగారి పులావ్, ఘుమఘుమలు, గొంగూర-ఉలవచారు, నిరుద్యోగి ఎంఏ, బీఈడీ, మొదటి ముద్దలాంటి పేర్లు జనంలో నానుతున్నాయి.

పేరే ప్రధానంగా..
మహానగరంలో చిన్నషాపు పెట్టాలనుకున్నా..పబ్లిసిటీకి వేలాదిరూపాయలు ఖర్చు చేయాలి. పెద్ద హోటళ్లయితే లక్షలు వెచ్చించి ప్రకటనలు, బోర్డులు ఏర్పాటు చేస్తుంటాయి. కోట్లు ఖర్చు పెట్టి వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయిస్తారు. వ్యాపారం బాగా సాగాలంటే పబ్లిసిటీ కూడా అదేస్థాయిలో ఉండాలి. అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నాయి కొన్ని హోటళ్లు. జనం వాడుక భాషనే ప్రధానాస్త్రంగా వినూత్న పేర్లతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
మాపేరు అందరికీ నచ్చింది
ఫుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకున్నాం. ఏ పేరు పెట్టాలని చాలా తర్జనభర్జనకు గురయ్యాం. ఇప్పుడు బిజినెస్ సక్సెస్ కావాలంటే క్యాచీ నేమ్స్ ప్రధానంగా మారాయి. కస్టమర్ హోటల్‌కు రావాలంటే మొదట మన షాపు లుక్..పేరు ఆకట్టుకోవాలి. అలా ఆలోచించి స్నాక్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం.
– భార్గవ్ వెంట్రప్రగడ, తిందారామామ స్నాక్ రెస్టారెంట్ సీఈవో
పేరుతోనే గిరాకీ పెరిగింది
తొలుత పేరు పెట్టే ముందు అందరూ నవ్వుకుంటారేమో అనుకున్నాం. చాలామంది వద్దన్నారు. అయినా ధైర్యం చేసి పెట్టాం. అదే పేరు సక్సెస్ అయ్యింది. జనం బాగా ఆదరిస్తున్నారు. ఫుడ్‌తోపాటు పేరు బాగుందని చెబుతుంటే హ్యాపీగా ఉంది. మా నాన్న హోటల్ నడిపించి మరణించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలనే హోటల్ బిజినెస్‌లోకి వచ్చాం.
– ఎం.గాంధీ, తిన్నంత భోజనం యజమాని
పేరు చూసి హోటల్‌కు వెళ్లాం
‘తిన్నంత భోజనం’ కాన్సెప్ట్ బాగా నచ్చింది. రూ.50కే తినేంత భోజనం పెడుతున్నారు. పేరు చదవగానే కడుపునింపుకోవాలనే ఆశ కలిగింది. నేను వరంగల్ వెళ్తుండగా పేరు చూసి ఆగిన. ఎవ్వరైన తిన్నారా అని అడిగితే..తిన్నంత భోజనం తిన్నాం అంటూ సమాధానం ఇవ్వడం కూడా బాగా నచ్చింది.
-వరుణ్, కస్టమర్