అమీర్‌పేట్, ఫిబ్రవరి 19 : సోలార్ విద్యుత్ వినియోగించుకునే దిశగా ప్రజలు దృష్టి సా రించాలని కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి సూచించారు. సనత్‌నగర్ డివిజన్లోని మోడల్‌కాలనీలోని పూజిత ఎస్టేట్స్ అపార్ట్మెంట్స్ నివాసితులు 10కేవీ సామర్థ్యం గల సోలార్ వ్యవసవ్థను ఏర్పాటు చేసుకున్నారు. శనివారం ఈ నూతన సోలార్ విద్యుత్ వ్యవస్థను కార్పొరేటర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పూజిత ఎస్టేట్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వీరారెడ్డి, శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం 126 ఫ్లాట్లు ఉన్న తమ అపార్ట్‌మెంట్‌కు మొత్తం 30 కేవీ సామర్థ్యం గల సౌరశక్తి విద్యుత్ అవసరం ఉందని, అయితే పైలెట్ ప్రాజెక్ట్‌గా మొదట రూ. 5.70 లక్షల వ్యయంతో 10 కేవీ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ టాటా కంపెనీ వారి సహకారంతో ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ విధంగా ప్రతి యేటా దాదాపు రూ. లక్ష చొప్పున మొత్తంగా 24 లక్షల వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే వీలుందన్నారు. నాయకులు కొలను బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.