హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: విజయ డెయిరీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని లాలాపేట్‌లోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర విజయ డెయిరీ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ, విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు రూ.4 ఇన్సెంటివ్‌తో పాటు అదనంగా పాడి రైతుల పిల్లలను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యా కానుక, ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం, నిరంతరం డెయిరీకి పాలు పోసే వారికి విజయ మహారాజు, మహారాణి కింద రూ.2,116 రూపాయలు, సబ్సిడీపై పశుదాన, ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం అందిస్తున్న అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. డెయిరీ ఉత్పత్తులను, గతంలో 3 లక్షల లీటర్లుగా ఉన్న పాల సేకరణను 4.5 లక్షల లీటర్లకు పెంచాలని ఆదేశించారు.
దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన దళిత బంధు పథకంలో భాగంగా మినీ డెయిరీలను ఇవ్వాలని డిప్యూటీ డైరెక్టర్లను అదేశించారు. ప్రస్తుతం, 700 కోట్లకు చేరుకున్న ‘విజయ’ వ్యాపారాన్ని 750 కోట్లకు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 124 బూత్ మిల్క్ సెంటర్లను 200లకు పెంచాలని చెప్పారు. పాడి రైతులకు పాల ధరలను పెంచాలని సమావేశంలో నిర్ణయించగా, ఫిబ్రవరి 16 నుంచి పాల ధరలను అమలు చేస్తామని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆధర్ సిన్హా తెలిపారు. సమావేశంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రామ్‌చందర్, మంత్రి ఓఎస్డీ కల్యాణ్, డెయిరీ సీనియర్ అధికారులు, అన్ని జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్ఎస్ఎంలు పాల్గొన్నారు.