గౌతంనగర్, ఫిబ్రవరి14 : మౌలాలిలోని హజ్రత్ అలీబాబా దర్గా( పంజాబాబా) భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. కులమతాలకు అతీతంగా దర్గాను దర్శించుకుంటారు. హజ్రత్ అలీబాబా జయంతి సందర్భంగా ఉర్సు ఉత్సవాలు ఫిబ్రవరి 15 నుంచి 22 వరకు జరుగనున్నాయి. ఉత్సవాలకు వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్గాను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఉర్సు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, దర్గా కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కులీకుతుబ్షా కాలంలోనే నిర్మాణం..
మౌలాలి గుట్టపైన దర్గాలో హజ్రత్ అలీబాబాను దర్శించుకుంటే ఆపదలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వా సం. ఈ దర్గాను 1578లో నాలుగో కులీకుతుబ్షాహీ నవాబ్ నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. దర్గాపైకి వెళ్లేందుకు 505 మెట్లతో పాటు రెండు ప్రవేశ ద్వారాలను నిర్మించారు.
మూడు రోజుల పాటు దర్శనం
ఈ ఉర్సు వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు ఫిబ్రవరి18, 19, 20 తేదీల్లో దర్గా అంతర్ భాగంలో ఉన్న హజ్రత్ అలీబాబాను అన్ని వర్గాల ప్రజలు దర్శించుకోవచ్చని దర్గా సూపరింటెండెంట్ మీర్ అష్రఫ్ అలీ తెలిపారు. ఈ మూడు రోజుల పాటు హిందువులు, క్రిస్టియ న్లు, సిక్కులు, బౌద్దులు తదితర అన్ని మతాలకు చెందిన ప్రజలు దర్గా అంతర్భాగంలో ఉన్న హజ్రత్ అలీబాబాను నేరుగా తాకి పూలదండ లు వేసి..మొక్కులు తీర్చుకునే అవకాశాన్ని దర్గా కమిటీ కల్పిస్తుందని మీర్ అష్రఫ్ అలీ తెలిపారు.