ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలలో పనుల అంచనాలను రూపొందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. నిధులు వృథా అయ్యే అవకాశం లేకుండా కలెక్టర్ పర్యవేక్షించనున్నారు. పాఠశాలలో అవసరమైన మరమ్మతు పనులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, ల్యాబొరేటరీ, లైబ్రరీ, ప్రహారి, వంట గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ తరగతులు తదితర పనులకు ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం పక్కాగా ప్రణాళికలను రూపొందిస్తారు.
మేడ్చల్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొదటి దశలో 33 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ మేరకు జిల్లాలో 175 ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని ప్రభుత్వ పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సమాన నిష్పత్తిలో అధికారుల బృందం పరిశీలించి ఎంపిక చేయనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను ముందుగా ఎంపిక చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరి భాగస్వామ్యం…
మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులు చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, జడ్పీటీసీ సభ్యులు, పాఠశాలల నిర్వహణ కమిటీలు, సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములు చేయనున్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పాటు అందించేందుకు విరాళాలు ఇచ్చే దాతలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
తొలిదశలో 33శాతం…
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత పటిష్టం కానున్నాయి. మొదటి దశలో 33 శాతం ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని సౌకర్యాలు కల్పించేలా సిద్ధం చేస్తాం. మన ఊరు – మనబడి కార్యక్రమంలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల పరిశీలనకు క్షేత్రస్థాయిలో అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశాం. త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సహకారాన్ని తీసుకుంటాం. గ్రామాభివృద్ధి కమిటీలు కూడా పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తాం.
– కలెక్టర్ హరీశ్