సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 14: మునుగోడు నియోజకవర్గానికి సాగు జలాలు అందించే చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ నీళ్లతో మునుగోడు ప్రజల కాళ్లు కడుగుతానని వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ, కడిలబావి తండా, తుంబావి తండా, వెంకంబావి తండా, శేరిగూడెం, మహమ్మదాబాద్, గుడిమల్కాపురం, కోతులాపురం, అల్లందేవి చెరువు గ్రామాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి పర్యటించారు.
గ్రామాలకు వచ్చిన ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులకు గిరిజన సంప్రదాయ నృత్యాలు, డబ్బులు కోలాటాలు బతుకమ్మలు, డీజే చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. నిధులిచ్చినా ఖర్చు పెట్టలేని అసమర్థుడు రాజగోపాల్‌రెడ్డిని ఉప ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. ఉప ఎన్నికల్లో గెలిపిస్తే సీఎం కేసీఆర్ దగ్గర నుంచి నిధులు తెచ్చి, మునుగోడు నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. 2014లో అవకాశం ఇచ్చారని,
సేవకుడైన పని చేస్తానని స్పష్టం చేశారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, గిరిజనబంధు పథకం ప్రకటించిన కేసీఆర్ వెంటే గిరిజనులందరూ ఉండాలన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ 90వేల ఓట్లను 18వేల కోట్లకు కుదవపెట్టిన నీచుడు రాజగోపాల్‌రెడ్డి అని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయాల కోసం మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డమీద నుంచి తరిమికొట్టాలన్నారు.. సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ వందరోజుల పనిని రద్దు చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీని మునుగోడు గడ్డమీద అడుగుపెట్టనీయమని హెచ్చరించారు.
వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉప ఎన్నికల్లో 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఉప ఎన్నికలు వచ్చాయని, అమ్ముడుపోయిన రాజగోపాల్‌ని ఊరి పొలిమేరలోని బొంద పెట్టాలన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ ఆటాపాటలతో టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి గౌడ్, ఎంపీటీసీ శివరాత్రి కవితాసాగర్, సర్పంచులు దోనూరి జైపాల్ రెడ్డి, రాచకొండ ఒగ్గు గణేశ్, పాండురంగ నాయక్, మన్నె పుష్పలత, మల్లెపల్లి సునీత, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగొని గాలయ్య, సీపీఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, వామపక్షాల, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, వెంకంబావి తండాలో 20మంది బీజేపీ కార్యకర్తలు కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.