ముగ్గురు పాతనేరస్థులు.. వేర్వేరు కేసుల్లో చర్లపల్లి జైలులో కలిశారు.. బయటకొచ్చిన తర్వాత సులువుగా సంపాదించాలని పథకం వేశారు.. ఇందుకు టులెట్ బోర్డులున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకున్నారు.. రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లి ఇల్లు చూపించమని అడుగుతారు..మాటల్లో పెట్టి ఆభరణాలు ఎత్తుకెళ్తారు. జనవరి 31న సాగర్‌రోడ్డు హస్తినాపురంలో ఇంటి యజమానురాలి ఆభరణాల దోపిడీ కేసును పోలీసులు చేధించి ముగ్గురిని అరెస్టు చేశారు. తీగలాగితే..దోపిడీతోపాటు నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ముగ్గురు పాత నేరస్థుల్లో ఒకరు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. ఆరాతీయగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసి నగరంలో రద్దీ ప్రాంతాల్లో మారుస్తున్నట్లు తేల్చారు. అసలు రూ.50 వేలు ఇస్తే..లక్షరూపాయల నకిలీ నోట్లు ఇస్తున్నట్లు స్పష్టమైంది. 10 మంది ముఠా నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో భారీగా నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసినట్లు తెలిసింది. ముగ్గురు పాత నేరస్థులతోపాటు ముఠాలోని 8 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): తీగ లాగితే.. డొంక కదిలింది.. దోపిడీ దొంగలను పట్టుకుంటే.. నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం…నెల్లూరుకు చెందిన పేరం వెంకట శేషయ్య, యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన మహ్మద్ అహ్మద్, కుత్బుల్లాపూర్‌కు చెందిన ముప్పిడి హరిబాబు పాత నేరస్తులు. టు లెట్ బోర్డు ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని..దోపిడీలు చేస్తుంటారు. జనవరి 31న హస్తినాపూరం కాలనీలో ఓ ఇంటి ముందు టులెట్ బోర్డును గుర్తించి..
యజమానురాలితో ఇంటి అద్దె కోసం మాట్లాడారు. మరుసటి రోజు వచ్చిన ముగ్గురు.. అడ్వాన్స్ తీసుకొచ్చామని చెప్పారు. ఇంట్లో ఎవరు లేరని.. తర్వాత రావాలని చెప్పడంతో మంచినీళ్లు ఇవ్వండని అడిగారు. లోపలికి వెళ్తున్న క్రమంలో దుండగులు ఆమె గొంతును పట్టుకుని.. ఆరు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసి.. సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఎల్బీనగర్ పోలీసులు పేరం వెంకట శేషయ్య గదిలో సోదాలు జరిపినప్పుడు నకిలీ కరెన్సీని గుర్తించి..ఆరా తీశారు.
50 వేల అసలుకు.. లక్ష నకిలీవి..
వెంకట శేషయ్యను విచారించినప్పుడు నకిలీ కరెన్సీని తూర్పు గోదావరి అనపర్తికి చెందిన ఒగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి తయారు చేస్తున్నాడని వెల్లడించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంకట కృష్ణారెడ్డి తూర్పు గోదావరికి చెందిన కొడూరి శివ గణేశ్, కొవ్వూరు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కర్రి నాగేంద్ర సుధా మాధవరెడ్డి, సొరంపుడి శ్రీనివాస్, పిల్ల రామకృష్ణ, హైదరాబాద్‌కు చెందిన తోట సంతోష్‌కుమార్, పేరం వెంకట శేషయ్య, నాగిరెడ్డిలను అనుచరులుగా, ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని..
అసలు నోట్లను తలపించే విధంగా రూ. 100, 200, 500 డినామినేషన్లో నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నాడు. ఆర్బీఐకి సంబంధించి స్ట్రిప్‌లను సైతం అందులో పెడుతున్నాడు. 50 వేలు అసలు కరెన్సీకి.. లక్ష నకిలీ నోట్లను ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు. పేరం వెంకట శేషయ్య 50 వేల నకిలీ కరెన్సీని తీసుకుని.. అందులో 10 వేల నోట్లను హైదరాబాద్‌లో చలామణి చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ముఠాలోని 8 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నాగిరెడ్డి, మస్తాన్లు పరారీలో ఉన్నారు. కాగా, నోట్లను తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అనేక సార్లు పరిశీలించుకోవాలని సీపీ మహేశ్ భగవత్ సూచించారు. ఈ రెండు కేసులను ఛేదించిన ఎల్బీనగర్ పోలీసులను అభినందించారు.