విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి ఏడాది ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పోటీల్లో మన విద్యార్థులు సత్తా చాటారు. తమ ప్రతిభకు పదును పెట్టి వినూత్న ప్రయోగాలతో జాతీయస్థాయిలో పేరు గడించారు. కొవిడ్ బ్యాడ్జి, వెంటిలేటర్, వ్యర్థవాయువులతో విద్యుత్ ఉత్పత్తి వంటి ఎగ్జిబిట్లు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి.
కొవిడ్ బ్యాడ్జి
హిమాయత్‌నగర్ సెయింట్‌పాల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న వి. అమర్థ్య అనే విద్యార్థి రూపొందించిన ‘కొవిడ్ బ్యాడ్జి’ నేషనల్ ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైందని డీఈవో రోహిణి తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ -19 నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో జ్వర లక్షణాలతో ఉన్న విద్యార్థులను తక్షణమే గుర్తించేందుకు కొవిడ్ బ్యాడ్జిని రూపొందించారు. బ్యాడ్జిని విద్యార్థులు జేబులకు పెట్టుకోవాలి. జ్వర లక్షణాలు ఉన్నట్లయితే కొవిడ్ బ్యాడ్జి ఎల్ఈడీ రూపంలో ఉన్న లైటు వెలుగుతుంది. దీంతో ఆ విద్యార్థిని వెంటనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించవచ్చు.
సామాన్యుడి వెంటిలేటర్
జీడిమెట్ల, ఫిబ్రవరి10 : కరోనా సమయంలో వెంటిలేటర్ ప్రాధన్యత పెరిగింది. సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్‌లోని నవజ్యోతి హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని కె.అక్ష తన గైడ్ టీచర్ ఎన్.రజనీ సహకారంతో తక్కువ ఖర్చులో వెంటిలేటర్‌ను తయారు చేసింది. ఇది జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది. తన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థిని అక్ష తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని రూపకల్పన చేస్తానని చెప్పారు.
వ్యర్థ వాయువులతో విద్యుత్
తుర్కయాంజాల్, ఫిబ్రవరి 10 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజాల్ జడ్పీ పాఠశాలలో పదోతరగతి చదివిన గుండా శ్రీనివాస్ ఉపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వ్యర్థ వాయువులతో విద్యుత్‌ను తయారు చేసే ఎగ్జిబిట్‌ను రూపొందించాడు. పొగ గొట్టాల మధ్యలో టర్బైన్లు అమర్చి వాటి మీదుగా వ్యర్థ వాయువులను అధిక వేగంతో బయటికి విడుదల చేయాలి. ఆ సమయంలో టర్బైన్లు తిరిగి అవి డైనమోకు అనుసంధానం అయ్యి ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా విద్యుత్‌ను తయారు చేయటం వల్ల ఎలాంటి హానికరం లేకపోగా సులువుగా పరిశ్రమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
చౌకగా విద్యుత్ ఉత్పత్తికి కృషి
ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ ప్రాజెక్టుకు మరిన్ని మెరుగులుదిద్దుతాను. నా ఆలోచనలకు పదును పెట్టి భారీ పరిశ్రమలకు అత్యంత సులువుగా, చౌకగా విద్యుత్ ఉత్పత్తి అందేలా కృషి చేస్తాను. మా ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. అక్కడ కూడ అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ర్టానికి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తాను.
సంతోషంగా ఉంది
విద్యార్థుల జ్వరాన్ని గుర్తించి వెంటనే తెలుసుకోవడానికి కొవిడ్బ్యాడ్జిని రూపొందించాను. ఇది జాతీయ స్థాయికి ఎంపిక అవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది రూపొందించడానికి పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, టీచర్లు ఎంతో సహకారం అందించారు. జాతీయ స్థాయిలోనూ విజయం సాధించడానికి కృషి చేస్తాను.
– వి. అమర్త్య, సెయింట్ పాల్ హైస్కూల్ విద్యార్థి