
సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తాను మరణిస్తూ.. మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని అందించాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బాదావత్ శ్రీను (33). డ్రైవర్గా పని చేస్తున్న శ్రీనుకు భార్య, చత్రపతి (7), నవ్య (6) పిల్లలు ఉన్నారు. అయితే ఈ నెల 22న తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ జంతువు అడ్డురాగా, దాన్ని తప్పించే క్రమంలో కిందపడిపోయారు. శ్రీను తలకు తీవ్రగాయం కాగా, అతని సోదరుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అయితే శ్రీనును మెరుగైన వైద్యం కోసం యశోదకు తరలించడగా ఈ నెల 25న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధ్దారించారు. దీంతో జీవన్ దాన్ ప్రతినిధులు శ్రీను కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం విశిష్టతను వివరించగా వారు అంగీకరించారు. శ్రీను శరీరం నుంచి కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కండ్లను సేకరించారు.