
సైదాబాద్, జనవరి 23 : భర్తతో ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరుతానని నాగర్జునసాగర్ ప్రాజెక్టులో ఎస్ఈగా పనిచేస్తున్న ధర్మనాయక్ భార్య బోడ పద్మజ తెలిపింది. ఆదివారం అక్బర్‌బాగ్ పల్టన్‌లో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో పద్మజ భర్త వేదింపులను వివరించింది. తన భర్త ఇరిగేషన్ శాఖలో పనిచేస్తుండగా ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని 2008లో ఏసీబీ ఆధికారులు దాడులు జరిపి ఆస్తులను స్వాధీన పర్చుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి వేదింపులకు గురిచేస్తూ బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేయించారని తెలిపింది. అంతేకాకుండా నా పేరుపై ఉన్న ఆస్తులను ఆయన పేరుపై మార్చాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వివస్త్రను చేసి ఇంట్లో బంధించారని వాపోయింది. ప్రస్తుతం ఇంటినుంచి తప్పించుకు వచ్చానని, తన భర్తతో ప్రాణహాని ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా సైదాబాద్ సీఐ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ పద్మజ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
మిస్సింగ్ కేసు నమోదు
తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదని, ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయిందని శనివారం రాత్రి భర్త కొర్ర ధర్మనాయక్ ఫిర్యాదు చేయటంతో కేసు చేసినట్లు సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామి రెడ్డి తెలిపారు.