
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు కొనియాడారు. దళితులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దళితుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. దళిత విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని కీర్తించారు. చరిత్రలో మొదటిసారిగా మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేశారని ప్రశంసించారు. దళితులను ఆదుకునేందుకు, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకానికి రూపకల్పన చేశారన్నారు.