పుస్తకం అంటే పురోగమనం. దిక్సూచిగా మారి చైతన్య కరదీపిక అయ్యి మానవ మానసిక వికాసానికిదోహదం చేస్తున్నది. ఆదిమం నుంచి నేటి రోబోటిక్ యుగం వరకూ ఎన్ని తరాలు మారినా పుస్తకమేమానవ నాగరికతను ముందుండి నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా విజ్ఞానభాండాగారమే పుస్తకం. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో” అని ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు ఆనాడే పుస్తకానికున్న ప్రాముఖ్యతను చెప్పారు. కాలం మారినా, యుగాలు గడిచినా తరగని చరిత్ర ఏదైనా ఉందంటే పుస్తకానిదేనని చెప్పొచ్చు. పుస్తక పఠనం అంటే సంస్కృతి వికాసంతో పాటు ఆలోచనా ప్రవాహాలను పెంపొందించే జ్ఞాన నిధి. మౌన ప్రవక్తగా ఉన్నా.. ఎప్పటికప్పుడు మార్గదర్శిగా నిలుస్తూ మనిషిని మహావక్తగా తీర్చిదిద్దుతుంది. అదే పుస్తకానికున్న మహోన్నత శక్తి. నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్న పస్తక ప్రదర్శన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ సాహితీ ప్రియులను పలకరించింది.
పుస్తకం ఏ రూపంలో ఉన్నా చదివి విజ్ఞానం పెంచుకోవచ్చు. ప్రస్తుత తరం సాంకేతికతను అందిపుచ్చుకుని ఇ-బుక్స్‌ను చదువుతున్నారు. ఒకప్పుడు చేతిలో పుస్తకం పట్టుకుని చదివితేనే చదవడం అనేవారు. ఒకప్పుడు రచయితలు ప్రింట్ వేస్తేనే పుస్తకం అనేవారు సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత జాతీయ, అంతర్జాతీయంగా డిజిటల్ లైబ్రరీలు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో కాలాన్ని అనుసరించి పుస్తకం ఏ రూపంలో ఉన్నా చదవడమే మన కర్తవ్యంగా భావించాలి. డాక్టర్ జె. చెన్నయ్య, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శ
పుస్తకంలో లేని సమాచారం ఇంటర్నెట్లో దొరుకుతుంది. పుస్తకాల్లో ఉన్న విలువైన విషయాలు ఇంకా ఇంటర్నెట్లోకి రావాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ పుస్తకాన్ని ఆహ్వానించాల్సిందే. కాగిత పుస్తకాన్ని కొనసాగించాల్సిందే. పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్పులు వస్తాయి. ప్రస్తుతం మారిన పరిణామాలతో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఈ బుక్స్ వచ్చాయి. ఇప్పటి తరానికి ఇది సాధారణమైంది. న్యూ జనరేషన్ ఎలక్ట్రానిక్ పుస్తకాలను విశ్వసిస్తున్నారు. – మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్
పుస్తకాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చదువుకోవచ్చు. పుస్తకం చేతిలో ఉంటే ప్రపంచాన్ని జయించిన భావన కలుగుతుంది. ఈ-బుక్ విషయానికి వస్తే ఆర్థికంగా వెసులు బాటు ఉన్నవారికే ఇది సాధ్యం. పుస్తకమనేది అమ్మ అన్నం పెట్టినట్లు ఉంటే.. ఈ-బుక్ అనేది హోటల్లో తినే భోజనం లాంటిది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ -బుక్‌లకు ఉండే ప్రయోజనాలూ ఉన్నాయి. పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదివినపుడు కలిగే ఆనందం, తృప్తి, ఈ-బుక్‌తో రాదు. – డాక్టర్ పత్తిపాక మోహన్, తెలుగు సంపాదకుడు, నేషనల్ బుక్‌ట్రస్ట్
పుస్తక పఠనం జ్ఞాన అన్వేషణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మారుతున్న కాలక్రమంలో పుస్తకాలు మార్పు చెందుతూ వస్తున్నాయి. ఒకప్పుడు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదివేది. ఇప్పుడు సెల్ఫోన్లు, టెక్నాలజీ పెరగడంతో ఈ-బుక్స్ అందుబాటులోకి వచ్చాయి. భౌతికంగా ఉండే పుస్తకాలతో పోలిస్తే ఈ-బుక్స్‌తో ప్రయోజనాలు తక్కువ. పుస్తకాన్ని చేతితో పట్టుకుని చదివితే ఏర్పడే గాఢత మరిచిపోలేనిది. ఈ-బుక్స్‌తో ఆ అనుబంధం ఉండదు. నచ్చిన పేజీని తిప్పుతూ నచ్చిన వాక్యాన్ని గీత గీసుకుంటాం. కంప్యూటర్ స్క్రీన్‌పై చదివే అక్షరాలను ఓన్ చేసుకోలేం. ఎంతైనా పుస్తకానికి ఉండే ప్రాధాన్యత దానిదే. – ప్రొఫెసర్ సూర్యాధనుంజయ, ఓయూ తెలుగు విభాగం హెడ్
సమాజంలో మార్పు తీసుకువచ్చేది పుస్తకం. మనిషిని మనిషిగా.. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు మరల్చేది పుసకం. పుస్తక పఠనంతో ఎందరో మహనీయులుగా మారారు. తల్లిదండ్రులు పిల్లలకు పుస్తక పఠనాన్ని నేర్పించాలి. నేటి తరం కంప్యూటర్లు, సెల్ఫోన్లలో ఈ- పుస్తకాలు చదువుతున్నారు. ఇది అనారోగ్యాన్ని కలిగిస్తేదే తప్ప విజ్ఞానాన్ని పెంచదు. తెలంగాణ ప్రభుత్వం పుస్తక పండుగను నిర్వహించడం అభినందనీయం.- జి.వసుంధర, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సెక్రటరీ
ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్స్ వాడుకలోకి వచ్చాయి. ఇదొక అనివార్య పరిణామం. భారతదేశం చాలా గొప్పది. విమానం వచ్చిందని ఎడ్లబండిని వదులుకోలేదు. అందుకే ఇటు ఎలక్ట్రానిక్ పుస్తకాలు ఉంటాయి. అటు పుస్తకం కొనసాగుతుంది. పేపర్ బుక్కు చెట్లను కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అదే ఈ-బుక్కు అవసరం లేదు. ఇందులో పర్యావరణ హితం కూడా ఉంది. బుక్స్ ఫెయిర్ లాంటివి వందల ఏండ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తాయి. రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ఉత్తమం.- నీరజ గోడవర్తి, సంగీత గాయని
పుస్తక పఠనం అనేది గొప్ప ప్రేరణ. జీవితంలో ఎంతో మందికి గొప్ప మార్గదర్శిగా నిలిచేవి పుస్తకాలే. విశ్వాన్ని, విశ్వ గమనాన్ని అవగతం చేసుకొని.. మానవుడు తనకేది.. సమస్త జగత్తుకేదీ హితకారమో తెలుసుకొని నిజమైన ఆనందం ఏదో ఎరుక కలుగించేది సాహిత్యం. ఏ దేశంలోనైతే పుస్తక అధ్యయనం ఎక్కువగా ఉంటుందో ఆ దేశం, ఆ ప్రాంతం మానవీయతను పోగుచేసుకుంటుంది. అచ్చువేసిన బుక్స్, ఈ-పుస్తకాలు ఏ సమయానికి అవే వాటి ప్రత్యేకతను కనబర్చుతాయి. పుస్తక ప్రదర్శన ఏర్పాటు ఎంతో అభినందనీయం. – గోరేటి వెంకన్న, కవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ
పుస్తకాలు జ్ఞాన సముపార్జనకు వారధులు. పుస్తక ప్రదర్శన అనేది నా దృష్టిలో ఒక పండుగ. సాహితీ ప్రియులకే కాదు అందరికీ ఇది ఎంతో అవసరం. నిత్యనూతనంగా మనోవికాసాన్ని తీర్చిదిద్దే గొప్ప ఓపెన్ విండో లాంటిది. మానవ నాగరికతకు, చైతన్యానికి దిక్సూచిగా నిలిచింది పుస్తకమే. ప్రాంతీయ భాషలను డిజిటలీకరణ చేయడం ఎంతో అవసరం. కానీ అచ్చువేసిన పుస్తకాలను చదవడం వల్ల సమయంతో పాటు ఖర్చుకూడా ఆదా అవుతుంది. మనిషి వికాసానికి ఎంతో తోడ్పాటునందిస్తుంది. – ఏనుగు నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి, కవి
పుస్తకాన్ని చదవడం ద్వారా మనిషితో మాట్లాడినంత అనుభవం వస్తుంది. పుస్తకాన్ని కొన్ని గంటల తరబడి చదవడానికి అవకాశం ఉంటుంది. చదివినకొద్దీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. డిజిటలైజేషన్లో అలా ఉండదు. చదవడంలో కొంత అలసట ఏర్పడుతుంది. ఎక్కువ సేపు చదవలేం. ఈ-పుస్తకాల కంటే ప్రింట్ బుక్సే ఎక్కువ సంతృప్తినిచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోని అనేక మంది మనస్తత్వాలు, స్వభావాలు, అన్ని కాలాల చరిత్రను తెలుసుకొనే అవకాశం ఉంటుంది. – నందిని సిధారెడ్డి, కవి, రచయిత
ప్రపంచ గమనాన్ని మార్చిన చరిత్ర పుస్తకానిది. పుస్తకాన్ని మించిన గొప్ప జ్ఞాన సంపద మరొకటి లేదు. పుస్తక ప్రదర్శనలను ప్రతి మండలంలో నిర్వహించాలి. అప్పుడే సమున్నతమైన జ్ఞాన సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఇక ఆన్లైన్ పుస్తక పఠనం అంటే తెరమీద ఎన్నో బొమ్మలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పుస్తకాన్ని చదివితేనే కంటి ఆరోగ్యానికి మంచిది. జ్ఞానసముపార్జనకూ ఇంపుగా ఉంటుంది. డిజిటల్ పుస్తకాల కంటే అచ్చువేసిన పుస్తకాలే సాహిత్యంలో అమృతం లాంటివని నా అభిప్రాయం.- జయరాజు, ప్రజాకవి
పుస్తకముంటే మనతో గురువున్నట్టే. పుస్తకాన్ని అవసరమైనప్పుడు చదివే అవకాశం ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లి చదువుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రం అలా కాదు.. కంప్యూటర్ కావాలి. ఇంటర్నెట్, అనుకున్న అంశాల్ని చదవాలంటే ఆన్లైన్లో వెతుకులాడాలి. డిజిటలైజేషన్ ఖర్చుతో కూడుకున్నది. అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండకపోవచ్చు. తలకు మించిన ఖర్చుతో పాటు ఎక్కువ సమాచారాన్ని తిరిగేయాల్సి వస్తుంది. ఏదైతే మనం చదువాలనుకుంటామో దానిని మనం పొందలేం. – ప్రొఫెసర్ సవీన్, సెల్ట్ డైరెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీ