
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఓపెనింగ్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. సోమవారం గ్రూప్-ఈలో భాగంగా గురుగ్రామ్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోరులో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (41), నితీశ్ రాణా (34) సత్తాచాటారు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 2, రవితేజ, అబ్దుల్, విహారి తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్తో పాటు ఠాకూర్ తిలక్ వర్మ (37) రాణించాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. తనయ్ త్యాగరాజన్ (17 నాటౌట్), సీవీ మిలింద్ (14 నాటౌట్) భారీ షాట్లతో జట్టును గెలిపించారు.