హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణ డాక్టర్లంతా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టంచేశారు. కారు గుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పట్టణానికి చెందిన డాక్టర్లు వారి కుటుంబ సభ్యులతో సహా మంత్రి గంగుల కమలాకర్‌ను శనివారం స్థానిక ఐఎంఏ భవనంలో కలిశారు. తీర్మాన లేఖను మంత్రి గంగులకు అందజేశారు.
టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్థాయి నుంచి వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్న తీరుకు ఆకర్షితులమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్లు చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకుంటామని తెలిపారు. తాము ఓటేయడంతోపాటు టీఆర్ఎస్కే ఓటేయాలని ప్రచారం కూడా చేస్తామన్నారు. కాగా, తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ వెంటే ఉంటామని నిర్ణయించుకున్న డాక్టర్లను గుంగల కమలాకర్ అభినందించారు. మంత్రిని కలిసినవారిలో డాక్టర్లు ఎం. కృష్ణమూర్తి, ఎం.నవీన్స్వాతి, ఎం. రాము , శ్రీవాణి, రామలింగారెడ్డి, నాగలింగం, చంద్రమౌళి, జే శ్రీనివాస్, శ్రీ విద్య స్వరూపారాణి, తదితరులున్నారు.