హుజూరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోని జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు షాగర్ల మనీష కుమార్, షాగర్ల రజిత శ్రీనివాస్, కనిక జగభాయి నరేష్, కరట్లపెల్లి శ్రీనివాస్ మంత్రి హరీశ్‌రావు, జమ్మికుంట ఇన్చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. వీరికి మంత్రి హరీశ్‌రావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో పలుపంచుకునేందుకు అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలస వస్తున్నారన్నారు. ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో అర్థం కాలేదన్నారు. ప్రభుత్వ పరమైన శాఖలను ప్రైవేట్ చేస్తున్న బీజేపీలో చేరి ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు అందరూ సహకరించాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ రైతులకు ఎకరాకు రూ. 10వేలు రైతుబంధు ఇచ్చిన ఘనత దేశంలో ఎక్కడ లేదన్నారు. ఇదే కాకుండా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5లక్షల రైతు బీమా ఇచ్చి రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నడని పేర్కొన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యదవ్ గెలుపునకు అందరూ సహకరించి గెలిపించాలన్నారు. జమ్మికుంట మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుని సైదాబాద్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మమత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రావు, రైతు సమన్వయ సమితి మెంబర్ లింగారావు, సర్పంచ్ రాజయ్య, తెరాస నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డుమెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.