హైదరాబాద్, నవంబర్ 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మనం ఎక్కడెక్కడికి వెళ్లామో, ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నామో స్మార్ట్‌ఫోన్‌లోని జీపీఎస్‌ను బట్టి తెలుసుకోవచ్చు. అయితే, ఫోన్ అవసరం లేకుండా మన శరీరం మీద ఉన్న సూక్ష్మక్రిములను బట్టి కూడా మనం ఎక్కడెక్కడికి వెళ్లొచ్చామో చిటికెలో తెలుసుకోవచ్చని స్వీడన్ పరిశోధకులు చెప్తున్నారు. తాము అభివృద్ధి చేసిన మైక్రోబియమ్ జియోగ్రాఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్ (ఎంజీపీఎస్) ఏఐ టూల్ సాయంతో ఓ వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్లొచ్చాడన్న విషయాన్ని తెలుసుకోవచ్చని వాళ్లు పేర్కొన్నారు.
సదరు వ్యక్తి శరీరం మీద ఉండే బ్యాక్టీరియా, ఫంగీ, ఆల్గే తదితర సూక్ష్మక్రిములను విశ్లేషించి అవి ఏయే ప్రాంతాల్లో ఏయే ఉష్ణోగ్రతల వద్ద ఎలా ప్రవర్తిస్తాయనే దాన్ని ఆధారంగా చేసుకొని తాము ఆ వ్యక్తి లొకేషన్‌ను ట్రాక్ చేయగలమని వెల్లడించారు. ఈ మేరకు 18 దేశాల్లోని 53 నగరాల్లోని 237 మట్టి నమూనాల్లోని అలాగే 131 నీటి వనరుల్లోని సూక్ష్మజీవుల వివరాలను ఈ ఏఐ టూల్లో నిక్షిప్తం చేసినట్టు వివరించారు. ఈ వివరాలు ‘జీనోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.