భద్రాచలం/ దుమ్ముగూడెం/ పర్ణశాల, జూలై 11: భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 33.30 అడుగులుగా ఉన్న వరద రాత్రి 10 గంటలకు 38.50 అడుగులకు చేరుకుంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరంతా గోదావరిలోకి వచ్చి చేరుతోంది.
దీంతో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రవాహం శుక్రవారం రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అధికారులు అంచనా వేస్తున్నారు. దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద ఇప్పటికే 18 అడుగులకు గోదావరి వరద చేరుకుంది. పర్ణశాలలోని సీతమ్మ వారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అక్కడ అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఎస్పీ రోహిత్‌రాజ్ శుక్రవారం వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలోని విస్తా కాంప్లెక్స్ వద్ద, కరకట్ట వద్ద మోటార్లను, పంపింగ్ విధానాన్ని గమనించారు. కరకట్ట వద్ద వరద లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు కూడా కరకట్ట వైపునకు రావద్దని సూచించారు. వరద ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉండడంతో స్థానిక పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఎస్సైలు తిరుపతి, స్వప్న, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గంటకు ఒక అడుగు చొప్పున ప్రవాహం పెరుగుతోంది. పర్ణశాల సీతవాగు వద్ద ఉన్న సీతమ్మ నార చీరల ప్రాంతం నీట మునగడంతో పర్ణశాల పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు, యాత్రికులు నార చీరల ప్రాంతాన్ని తిలకించకుండానే వెనుదిరుగుతున్నారు. అయితే, పర్ణశాలకు వచ్చే యాత్రికులు గోదావరిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, బోట్ షికారును నిలిపివేశామని కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.