ఖమ్మం సిటీ, మార్చి 8 : హెచ్‌పీవీ టీకాతో మహిళల్లోని గర్భాశయ క్యాన్సర్‌కు పూర్తిగా చెక్ పెట్టవచ్చని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం ఖమ్మంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం టీకా వచ్చిందన్నారు.
కౌమారదశ బాలికలకు టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో వ్యాధి రాకుండా కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని బాలికలందరికీ వారి తల్లిదండ్రుల ఆమోదంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితంగా ఇస్తామన్నారు. అనంతరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ హెల్త్ కేర్‌లో నర్సులకు బాగా డిమాండ్ ఉందన్నారు. ఆసుపత్రులతోపాటు దేశీయంగా వృద్ధుల సంరక్షణకు నర్సుల అవసరం పెరుగుతున్నదని, విదేశాల్లో సైతం అనేక అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిఫ్యూటీ మేయర్ ఫాతిమా, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్‌గౌడ్, పెద్దాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నరేందర్, ఆర్ఎంవోలు డాక్టర్ రాంబాబు, డాక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
పారిశుధ్యం పట్ల తీవ్ర అసంతృప్తి..
పెద్దాసుపత్రిలో పారిశుధ్యం పట్ల కలెక్టర్ అనుదీప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎక్కడచూసినా వ్యర్థాలు, అపరిశుభ్రత కనిపించడంతో సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వారంరోజుల వ్యవధిలో ఆసుపత్రి పారిశుధ్యంలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. ప్రస్తుత 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోని పనికిరాని పాత ఫర్నిచర్, ఎక్విప్మెంట్స్ను పూర్తిగా తొలగించాలన్నారు. మార్చి 15వ తేదీ నాటికి చేపట్టే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో సిబ్భందికి సరిగ్గా డ్యూటీలు వేస్తూ స్పష్టమైన మార్పు కనిపించేలా కార్యాచరణ ఉండాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ భవనం, పార్కింగ్ స్టాండ్‌ను పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
పాల్వంచ, మార్చి 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబుతో కలిసి ప్రారంభించారు. బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ ప్రత్యేక డ్రైవ్ మూడునెలలపాటు కొనసాగుతుందని, జిల్లావ్యాప్తంగా 10,398 మంది బాలికలను గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.