రోగం వస్తే మందు వాడాలి. కొన్ని మందులకు రోగాలు తగ్గకపోగా కొత్త రోగాలు చుట్టుకుంటున్నాయ్. పెయిన్ కిల్లర్స్ నొప్పినే కాదు కిడ్నీలనూ చంపేస్తాయ్. చీటికీ మాటికీ వేసుకునే యాంటి బయాటిక్స్ లాంగ్లైఫ్ని చిటికెలో చీకట్లో కలిపేస్తున్నాయ్. కాబట్టి రోగాల నుంచి కాపాడే మందులతో కాస్త జాగ్రత్తగా ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగాల నుంచి ఆరోగ్యాన్ని, మందుల నుంచి కిడ్నీలను ఎలా కాపాడు కోవాలో నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
శరీరంలో జరిగే జీవక్రియల వల్ల అనేక వ్యర్థాలు ఏర్పడతాయి. అన్ని అవయవాల్లోని వ్యర్థాలు రక్తంలోకి చేరతాయి. రక్తంలోని వ్యర్థాలను వేరు చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తూ దేహాన్ని కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుతాయి. మలిన రక్తాన్ని శుద్ధి చేస్తూనే దేహంలో రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తపోటు (బీపీ), రక్తంలో షుగర్ నియంత్రణలో లేకపోతే కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు రక్త శుద్ధి తగ్గుతుంది. సమస్య తీవ్రమైతే ప్రాణానికే ప్రమాదం. కిడ్నీలు విఫలమవడానికి బీపీ, షుగర్ (డయాబెటిస్) రోగాలతోపాటు రోగాల నివారణకు వాడే మందులు కూడా కారణమే. నొప్పుల నివారణకు తీసుకొనే (పెయిన్ కిల్లర్స్) మందులు, యాంటిబయాటిక్స్ కిడ్నీలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తాయి. మన దేశంలో 17శాతం మందికి కిడ్నీ జబ్బులు ఉన్నాయని సీక్ స్టడీలో గుర్తించారు. దీర్ఘకాలిక రోగులలో మూత్ర పిండాల రోగులూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే మూత్రపిండాలు విఫలమవడం వల్ల డయాలసిస్ అవసరమయ్యే రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది.
బీపీ, షుగర్, క్యాన్సర్, హెచ్ఐవీ, టీబీ, కాలేయ జబ్బులు, గుండె జబ్బులు, థైరాయిడ్, ఆర్థరైటిస్ రోగుల్లో కిడ్నీలకు అధిక ప్రమాదం ఉంటుంది. వీళ్లు దీర్ఘకాలం మందులు వాడాలి. ఆ మందుల దుష్ప్రభావంతో కిడ్నీలు దెబ్బతింటాయి. అందుకని దీర్ఘకాల రోగాలతో బాధపడేవాళ్లు సంవత్సరానికి ఒకసారి కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్‌ని తప్పకుండా చేయించుకోవాలి.

రోగాల నివారణ కోసం వాడే మందులు కిడ్నీలపై రెండు రకాల ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా ఏవైనా మందులు వాడినప్పుడు కిడ్నీ పనితీరు మందగిస్తుంది. కిడ్నీ పనితీరు తగ్గిన మొదటి ఏడు రోజుల వరకు అక్యూట్ కిడ్నీ ఇంజురీగా పరిగణిస్తారు. ఏడు రోజుల తర్వాత కూడా ఆ సమస్య ఉండి, తొంబై రోజుల లోపు వరకు కిడ్నీల పనితీరు తక్కువగా ఉంటే అక్యూట్ కిడ్నీ డిసీజ్ (ఏకేడీ) అంటారు.
ఆ సమస్యకు కారణమైన మందులను మానేస్తే కిడ్నీ పనితీరు మళ్లీ మెరుగుపడుతుంది. ఏకేడీ తగ్గుతుంది. తొంబై రోజుల కంటే ఎక్కువ కాలం కిడ్నీ సమస్యలతో బాధపడితే క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)గా పరిగణిస్తారు. ఈ దశలో డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది. తరచూ ఏకేడీకి గురయ్యే వారు సీకేడీ దశకు చేరుకునే ప్రమాదం ఉంది.
క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) బాధితుల్లో కిడ్నీల పనితీరు క్రమంగా క్షీణిస్తుంది. కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వేరు చేయలేకపోవడం వల్ల రోగి ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. చివరకు డయాలిసస్ అనివార్యమవుతుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్‌కి దగ్గరవుతున్నట్టు.
మన దేశంలో ప్రతి సంవత్సరం 2 నుంచి 5 లక్షల మంది కిడ్నీ రోగులు కొత్తగా డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు. ఈ రోగుల్లో సంవత్సరానికి 10 వేల మందికి మాత్రమే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయగలుగుతున్నాం. మిగిలిన 4.9 లక్షలమంది డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారు.

సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా కిడ్నీ పనితీరుని తెలుసుకునేందుకు పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ పనితీరు ఆధారంగా డ్రగ్ డోస్ నిర్ణయిస్తారు. ఎలాంటి మందుల వల్ల కిడ్నీల పనితీరు తగ్గుతుందో అలాంటి మందులను మార్చే ప్రయత్నం చేస్తారు. మార్చడానికి అవకాశం లేకపోతే ఆ మందులు తీసుకునే సమయాలు, మోతాదుల్లో మార్పులు సూచిస్తారు.
ఎక్కువ కాలం మందులు వాడితే.. అక్యూట్ ఆన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ బారినపడే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగులకు పదేళ్ల తర్వాత వచ్చే డయాలసిస్ దశ మందులు అతిగా వాడితే రెండు, మూడేళ్లకే వస్తుంది. ఇలా ముందుగానే డయాలసిస్ దశకు చేరుకునే రోగాన్ని ‘అక్యూట్ ఆన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్’ అంటారు. కాబట్టి రోగాలు తగ్గేందుకు మందులపైనే ఆధారపడకుండా ఆహారం, జాగ్రత్తలు, సరైన చికిత్సకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.