న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్టు ఆర్థికశాఖమంత్రి నిర్మల తెలిపారు. 3.8 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ కోసం రూ.60 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం హర్ ఘర్ నల్ సే జల్ పథకం కింద 8.7 కోట్ల ఇండ్లకు గానూ రెండేండ్లలో 5.5 కోట్ల ఇండ్లకు నీటి సదుపాయాన్ని కల్పించినట్టు వివరించారు. అయితే, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ సర్కారు ఇంటింటికీ ఉచిత మంచి నీటి సదుపాయాన్ని 100 శాతం పూర్తిచేసింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగు నీటిని అందిస్తున్నది. ఈ పథకాన్ని కొనియాడిన నీతి ఆయోగ్.. తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. కానీ, కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడేమో నల్లా కనెక్షన్ల కోసం రూ.60 వేల కోట్లు కేటాయిస్తూ నిర్మల ప్రకటన చేశారు. మరి ఈ కేటాయింపులనుంచైనా రాష్ర్టానికి నిధులు ఇస్తారా? లేదా? తెలియాల్సి ఉన్నది.
ఈసారైనా నిధులివ్వాలి: ఎమ్మెల్సీ కవిత
కేంద్రం హర్ ఘర్ నల్ సే జల్ పథకానికి ఈ ఏడాది రూ.60 వేల కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. ఈ సారైనా మిషన్ భగీరథకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటిని అందించటంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ పథకానికి రూ.19,205 కోట్లు కేటాయించాలని నాలుగేండ్ల కిందట కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ కేంద్రం స్పందించలేదు. ఈసారైనా మిషన్ భగీరథకు నిధులు కేటాయించాలి’ అని ట్వీట్ చేశారు.