నా పేరు ప్రకాశ్. మా తండ్రిగారు 2022లో చనిపోయారు. మేము మొత్తం 11 మంది. ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. మా మధ్య ఎలాంటి ఆస్తి పంపకాలు జరుగలేదు. నిజానికి మా నాన్న వీలునామా తయారు చేయించినా.. దాన్ని రిజిస్టర్ చేయకుండానే అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే మా అక్కాచెల్లెళ్లు ఆస్తిలో తమ వాటాను కోరుతూ 2024లో కోర్టును ఆశ్రయించారు. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 కింద కేసు దాఖలు చేశారు. ఈ ఆస్తులు మా నాన్న సంపాదించినవే. దయచేసి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో సలహా ఇవ్వండి.
హిందూ వారసత్వ చట్టం 1956 అమల్లోకి రాకముందు సంపాదించిన ఆస్తి అయితే తప్ప.. ఆ తర్వాత ఆర్జించిన ఆస్తిని పూర్వీకుల ఆస్తిగా పరిగణించలేము. ఈ ఆస్తుల్ని మీ నాన్నగారు తన సంపాదనతో కొన్నవేనని చెప్తున్నారు. కనుక ఈ ఆస్తులు హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) పరిధిలోకి కూడా రావు. ఇక భారతీయ వారసత్వ చట్టం కింద వీలునామాకు విలువ ఉండాలంటే అది రిజిస్టర్ కానక్కర్లేదు. అందువల్ల ఏవైనా ఇతర కారణాలుంటే తప్ప.. మీ నాన్నగారు చేయించిన వీలునామా చట్టబద్ధమైనదే.
కాగా, హిందూ వారసత్వ సవరణ చట్టం 2005.. 2005 సెప్టెంబర్ 9న అమల్లోకి వచ్చింది. 1956 చట్టాన్ని సవరించి ఆస్తిలో కొడుకులతోపాటు కూతుళ్లకూ సమాన హక్కుల్ని కల్పించారు. కాబట్టి ఆస్తుల్లో మీ అక్కాచెల్లెళ్లకూ వాటాలు ఉంటాయి. ఒకవేళ మీ నాన్నగారు వీలునామా చేయకుండానే మరణించినైట్టెతే.. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం మీ అక్కాచెల్లెళ్లు, మీ అన్నదమ్ములతోపాటు ఆస్తుల్లో మీ అమ్మగారు, మీ తాత, నానమ్మలకూ (జీవించి ఉంటే) సమాన వాటాలు వస్తాయి.