(గత వారం ‘చెలిమె’లో ప్రచురించిన ‘మహాభారతం విశ్వరూపం’ కొనసాగింపుగా..)
భారత ప్రభుత్వం మహాభారత గాథను వేద పండితుడు దామోదర్ సత్వల్కర్ సారథ్యంలో హిందీలోకి అనువదింపజేసింది. ధర్మవీర్ భారతి మహాభారత స్ఫూర్తితోనే 1955లో ‘అంధా యుగ్’ పేరిట నాటకాన్ని రాసి ప్రదర్శించారు. ‘యయాతి’ ఉపాఖ్యానాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1960లో మరాఠీలో ప్రముఖ రచయిత వీఎస్ ఖండేకర్ ఒక నవలను రాయగా, 1961లో అదే కథాంశాన్ని తీసుకొని కన్నడలో గిరీష్ కర్నాడ్ మరొక అద్భుతమైన నాటకాన్ని రాశారు.
ప్రముఖ చరిత్రకారిణి, పరిశోధకురాలు ఐరావతి కార్వే 1967లో ‘యుగాంత’ పేరుతో మరాఠీలో మహాభారత గాథలోని ప్రధాన పాత్రలను కేవలం పౌరాణిక పాత్రలుగా కాకుండా చారిత్రక వ్యక్తులుగా నిరూపించే ప్రయత్నం చేశారు. ప్రఖ్యాత కన్నడ రచయిత ఎస్ఎల్ భైరప్ప కన్నడంలో ‘పర్వ’ అనే పేరుతో 1975లో మహాభారతాన్ని తనదైన కోణంలో రచించారు. 1984లో ప్రముఖ రచయిత్రి ప్రతిభా రాయ్ ఒడియా భాషలో ద్రౌపదిని ప్రధానపాత్రగా చేసుకొని ‘యజ్ఞసేని’ నవలను రాశారు.
మహాభారతంలోని కొన్ని పాత్రలను ఆధారంగా చేసుకుని, కొంత కాల్పనికతను, సమకాలీన దృక్పథాన్ని జోడించి రాసిన రచనలు కూడా వచ్చాయి. కన్నడ బేలూరు గురుపాదస్వామి రచించిన ‘బర్బరీక’ ప్రస్తావించదగినది. ధృతరాష్ట్రుడి కోణంలోంచి మహాభారత గాథను చెప్పే ప్రయత్నాన్ని కన్నడలో రామచంద్ర భావే చేయడం విశేషం. 2008లో ప్రచురితమైన ఈ నవల పేరు ‘అంధపర్వం’ (దీనికి తెలుగులో వేలూరి కృష్ణమూర్తి అనువాదం 2020లో విడుదలైంది). ఆయనే ‘కురుక్షేత్ర ఘోర యుద్ధక్కె కారణ యారు?’ (కురుక్షేత్ర మహా సంగ్రామ కారకులు ఎవరు?) పేరుతో, ‘సర్పయాగ’ పేరుతో రెండు మహాభారత ఆధారిత గ్రంథాలను రాశారు.
తెలుగు ‘భారతం’: 11వ శతాబ్దిలో రాజరాజనరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ భట్టారకుడు సంస్కృత వేదవ్యాస విరచితమైన మహాభారతాన్ని ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ పేరిట తొలిసారిగా తెలుగులో అనువాదం చేశారు. ఆది, సభా, అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆయన అనువాదం చేయగా, మిగతా 15 పర్వాలను తిక్కన సోమయాజి, అరణ్య పర్వ శేషభాగాన్ని ఎఱ్ఱాప్రగడ అనువాదం చేసి మొత్తం 18 పర్వాల మహాభారతాన్ని తెలుగులో అందించారు. 1480లో వాణి నా రాణి అని ప్రకటించిన పిల్లలమర్రి పినవీరభద్రుడు సంస్కృతంలో జైమిని మహర్షి మహాభారత గాథల ఆధారంగా ‘జైమినీ భారతం’, ‘శృంగార శాకుంతలం’ అనే రెండు కావ్యాలను తెలుగులో రాశాడు. 18వ శతాబ్దం ప్రథమార్థంలో వేంకట కృష్ణప్పకవి ఐదు అధ్యాయాల వచన కావ్యంగా తెలుగులో అనువదించగా, ఏలూరిపాటి అనంతరామయ్య సాధారణ తెలుగులో రాశారు. ఆధునిక కాలంలో శ్రీపాద, పురిపండా ‘వ్యాసప్రోక్త మహాభారతం’ను, పుల్లెల శ్రీరామచంద్రుడు ‘మహాభారత సార సంగ్రహము’, ఉషశ్రీ ‘ఉషశ్రీ మహాభారతం’ పేరిట అనువాదం చేశారు.
తెలుగు రచయిత సౌదా ‘అపూర్వ పురాణ కథలు’ అనే పుస్తకంలో ఘటోత్కచుడి పుత్రుడైన బర్బరీకుని గాథను కథగా రాశాడు. కల్లూరి భాస్కరం ‘మహాభారతం మన కథే’ పుస్తకంలో శాస్త్రీయంగా విశ్లేషించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ‘ద్రౌపది’ పేరుతో రాసిన నవల చర్చనీయాంశమైంది. ప్రముఖ రచయిత చలం మహాభారతంలోని ‘పురూరవ’, ‘భానుమతి’ పాత్రల కో ణంలోంచి స్త్రీవాద దృక్పథంతో కొన్ని రచనలు చేశారు.
ఇంగ్లీష్ భారతం: మహాభారతాన్ని తొలిసారిగా ఇంగ్లీష్ వచన ప్రక్రియలో కిసారి మోహన్ గంగూలీ అనే రచయిత 1883-1896లో అనువదించి ప్రచురించారు. ఆ తర్వాత మరో అనువాదాన్ని మన్మథ నాథ్ దత్త కూడా ప్రచురించారు. 1898లో రమేష్ చంద్ర అనే కవి మహాభారతాన్ని ఇంగ్లీష్ వచన శైలిలో, పీ లాల్ అనే మరో పండితుడు కవిత్వ సంప్రదాయ పద్య రీతిలో అనువాదం చేశారు. విప్లవకారుడు నుంచి ఆద్యాత్మిక కోవిదుడిగా మారిన అరవింద ఘోష్ తనను జైలులో ఉంచిన క్రమంలో సావిత్రి-సత్యవంతుల గాథను స్ఫూర్తిగా తీసుకొని 2,400కి పైగా పంక్తులతో, 12 సంపుటాలతో Savitri: A Legend and A Symbol’ పేరిట ఒక చక్కని ఆద్యాత్మిక, భక్తి పూర్వక గాథను ఇంగ్లీషులో రచించారు.
భారతీయ పౌరాణిక గాథలను, రామాయణాన్ని ఎంతగానో ఇష్టపడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు సీ రాజగోపాలాచారి 1951లోనే మహాభారతాన్ని సంగ్రహంగా ఇంగ్లీషులోకి అనువదించి పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. 2008లో చిత్రా బెనర్జీ ఇంగ్లీషులో ‘A Palace of Illusions’ అనే పేరిట ఒక చక్కని నవలను రాశారు. మయసభ ఘట్టం ఆధారంగా రాసిన ఈ నవల పాశ్చాత్య ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది.
1919 నుండి 1967 వరకు 40 ఏండ్లపాటు నిరంతర పరిశోధన, తాళపత్ర గ్రంథాలను పరిశీలించిన పుణెలోని ‘బండార్కర్ ప్రాచ్య పరిశోధన సంస్థ’ మహాభారతాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా అనువదించే ప్రయత్నం చేసింది. ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ‘The Serpent’s Revenge: Unusual Tales from Maha Bharata’ అనే పేరిట మహాభారతంలోని ఉపాఖ్యానాలను, ఎన్నెన్నో ఉప కథలను స్పర్శిస్తూ ఒక చక్కని గ్రంథాన్ని రాశారు. ఇలా మహాభారత గాథ సంపూర్ణంగా, ఉపాఖ్యానాలు, ఉపకథలుగా అనంతరం రచయితలు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ వారు తమదైన కోణంలో ఆ గాథల్ని వివరించే విధంగా ప్రోత్సహిస్తూ వస్తున్నది.