Indian Family : అమెరికాలో భారత సంతతి వ్యక్తి.. తన భార్యతోసహా మరో ముగ్గురిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మాత్రం ప్రాణాలు కాపాడుకోగలిగారు. పిల్లలే అయినా.. ఆ సమయంలో వారు వ్యవహరించిన తీరు వారిని రక్షించిందని అక్కడి పోలీసులు అంటున్నారు. అమెరికాలోని, జార్జియా నగరంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య మీనుతోపాటు మరో ముగ్గురిని ఇంట్లోనే కాల్చి చంపాడు.
అయితే, ఈ ఘటన సందర్భంగా వాగ్వాదం జరిగినప్పుడే అక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన వెంటనే వారు ఒక గదిలోకి వెళ్లి, అల్మరాలో దాక్కున్నారు. ముగ్గురిలో ఒక చిన్నారి వెంటనే ఆలోచించి.. అమెరికా ఎమర్జెన్సీ నెంబర్ అయిన 911కు కాల్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అట్లాంటా పరిధి లారెన్స్ విల్లే సిటీలోని ఘటన జరిగిన ఇంటికి నిమిషాల వ్యవధిలోనే పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నలుగురు మరణించి ఉన్నారు. వారు బుల్లెట్ గాయాలతో మరణించినట్లు గుర్తించారు. ముందుగా అందిన సమాచారం ఆధారంగా రూంలో దాక్కున్న పిల్లల్ని పోలీసులు రక్షించారు. వారిని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 02.30 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, పలు ఛార్జెస్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించిది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ విషయంలో పిల్లలకు, వారి బంధువులకు ఎలాంటి సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది.