ఇంట్లో సొత్తు కాజేయాలని ప్లాన్
సంబంధీకుడిని ఇంటికి రప్పించిన పనిమనిషి
నిర్బంధించి వెళ్లాలని సూచన
దోపిడీ పర్వం ముగిశాక.. స్పృహతప్పి పడిపోయినట్లు యాక్టింగ్
తనపై దాడి చేసి.. దోచుకెళ్లారంటూ..నటన
పట్టపగలు చోరీ కేసులో ట్విస్ట్
మాజీ పనిమనిషే అసలు సూత్రధారి
సహకరించిన పనిమనిషి అర్చన
సెల్‌ఫోన్ కాల్‌డేటాతో గుట్టురట్టు
24 గంటల్లోనే కేసును ఛేదించిన ఎస్ఆర్నగర్ పోలీసులు
పారి ఇంట్లో చోరీ కేసులో ఊహించని ట్విస్ట్..పనిమనిషి రక్తికట్టిన నటనకు తోడు.. దోపిడీ కథలో మాజీ పనిమనిషి అసలు సూత్రధారని నిర్ధారణ అయింది. ఆమె ప్రస్తుత నిమనిషి, మరో ఇద్దరితో కలిసి డ్రామాకు తెరలేపిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
వెంగళరావునగర్, డిసెంబర్ 25: ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులో ఫ్యాన్ల వ్యాపారి వినోద్ పొడ్డర్ దంపతుల కుటుంబం నివాసముంటోంది. ఆర్నేళ్ల నుంచి అర్చన అనే మహిళ పనిమనిషిగా పనిచేస్తున్నది. అంతకుముందు పనిచేసిన బీజీఆర్నగర్కు చెందిన లక్ష్మి నాలుగు నెలల కిందట మానేసింది. అయితే ఆ ఇంట్లో బంగారు నగలు, డబ్బు ఎక్కడ దాచుతారోనన్న విషయాలు లక్ష్మికి బాగా తెలుసు. బంగారం, డబ్బు కాజేయాలని దుర్బుద్ధి పుట్టింది. తన ప్లాన్‌ను అర్చనకు చెప్పింది. ఆమె ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి తమకు పరిచయస్తులైన హకీంపేట్‌కు చెందిన గణేశ్, కుత్బుల్లాపూర్‌కు చెందిన నవీన్‌తో దోపిడీకి పథకం పన్నారు. వారం రోజుల పాటు ఇంటి ముందు ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించింది. గురువారం ఉదయాన్నే వినోద్ తన ఇద్దరు కుమారులతో కలిసి బాలానగర్‌లోని తన ఫ్యాక్టరీకి వెళ్లాడు. మిగతా వారు కోఠిలో ఫంక్షన్‌కు వెళ్లారు. సాయంత్రం వేళ వినోద్ తల్లిదండ్రులు బాబులాల్, కైలాసిదేవి వాకింగ్ కోసమని సమీపంలో ఉండే పార్కుకు వెళ్తుండగా, ఇదే సరైన సమయమని భావించిన అర్చన ఇల్లు శుభ్రం చేసే వంకతో వారి వద్ద తాళం చెవిని తీసుకొని.. డోర్ తెరిచింది. ఇంట్లోకి వెళ్లాక నవీన్‌కు ఫోన్ చేసి..పిలిపించింది.
నాటకమాడి..
నవీన్ ఇంట్లోకి చొరబడగా, భవనం బయట లక్ష్మి, గణేశ్ కాపలాగా ఉన్నారు. అర్చన చూపించిన బీరువాలో దాచిన 39 తులాల బంగారు నగలు, 5 లక్షల నగదు మూటగట్టుకున్నాడు. తనని ఓ గదిలో నిర్బంధించి వెళ్లాలని అర్చన చెప్పడంతో..నవీన్ ఆమెను గదిలో పెట్టి తాళం వేసి వెళ్లాడు. తిరిగొచ్చిన వృద్ధులకు ఇల్లంతా చిందరవందరగా కనిపించింది. నగలు, డబ్బు కనిపించలేదు. గది తాళం తెరవగా, లోపల అర్చన స్పృహ తప్పి పడి ఉన్నట్లు నటి స్తూ..కనిపించింది. ఇంట్లోకి దోపిడీ దొంగ చొరబడి తనను కత్తితో బెదిరించి..దాడి చేసి..గదిలో బంధిం చి.. సొమ్ములు దోచుకెళ్లాడని అర్చన చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్
పోలీలు దర్యాప్తు చేపట్టారు.
అర్చన కాల్‌డేటాతో..
ఇంటి యజమాని కుటుంబీకులతో కలిసి పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అర్చననే పోలీసులు అనుమానించారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో ఆమె సెల్‌ఫోన్ తీసుకొని.. కాల్‌డేటాను పరిశీలించారు. నవీన్, గణేశ్లతో ఎక్కువగా కాల్స్ చేసినట్టుగా గుర్తించారు. తమదైనశైలిలో విచారించేసరికి అసలు నిజం కక్కింది. లక్ష్మినే ఈ దోపిడీకి స్కెచ్ వేసినట్టు దర్యాప్తులో తేలింది.
తచ్చాడిన మరో దొంగ
అర్చనను పోలీసులు దర్యాప్తు చేస్తుండటాన్ని తెలుసుకున్న మరో నిందితుడు గణేశ్ పోలీసుస్టేషన్ ఎదుటే చాలాసేపు తచ్చాడాడు. అతడు పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతి తెలివిగా తన ఫోన్లో అర్చన కాల్స్ చేసిన వాటిని మాత్రమే డిలీట్ చేశాడు. కానీ అర్చన ఫోన్లో మాత్రం గణేశ్‌కు కాల్స్ వెళ్లినట్టు తేలడంతో అతడిని తమదైనశైలిలో ప్రశ్నించేసరికి నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో నవీన్, గణేశ్, లక్ష్మి, అర్చనలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల వ్యవధి లోనే కేసు మిస్టరీని ఛేదించి దొంగలను పట్టు కున్న ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్‌ప్రసాద్, సిబ్బందిని ఉన్నతాధి కారులు అభినందించారు.