అతడి పేరు ప్రకాశ్. నాలుగు రోజుల క్రితం కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇంటికి వెళితే కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదముందని భావించాడు. దవాఖానలో చేరుదామంటే అంత సీరియస్ లేదు. ఇంట్లో ఓ గదిలో ఉండే సాహసం చేయలేకపోయాడు. ఏం చేయాలో ఆలోచించి వెంటనే కొవిడ్ సేవలందించే ఓ హోటల్‌ను బుక్ చేసుకున్నాడు. 14 రోజుల ప్యాకేజీని మాట్లాడుకుని అందులో చేరాడు.
నగరంలో ఆతిథ్యం ఇచ్చే హోటళ్లు ఇలా కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుతున్నాయి. అతిథులకు బదులు పాజిటివ్ రోగులను ఆహ్వానిస్తున్నాయి. రూం లను వార్డులుగా మార్చి సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. క్వారంటైన్లో ఉన్న వారిని కంటికి రెప్పలా కాపాడేందుకు ముందుకొస్తున్నాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో వైద్యశాలలు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లూ కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు ముందుకొస్తున్నాయి. కరోనా సేవా కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ వైద్యశాలలతో కలిసి ఒప్పందం చేసుకుంటున్నాయి. హోటళ్లలోని సింగిల్, డబుల్ బెడ్ రూంలను ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి పాజిటివ్ రోగులకు కేటాయిస్తున్నాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, హైటీ, డిన్నర్‌ను సైతం అందిస్తున్నాయి. అంతేకాక క్వారంటైన్లో ఉన్నవారికి వైద్యులను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రతిరోజు రోగుల వద్దకు వెళ్తున్న వైద్యులు లక్షణాలను పరిశీలించడంతో పాటు అవసరమైన మందులను ఇస్తున్నారు. బీపీ, షుగర్, ఆక్సిజన్ లెవల్స్, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటే ఒప్పందం చేసుకున్న దవాఖానలకు తరలిస్తున్నారు.
నా స్నేహితుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను అతడితో సన్నిహితంగా ఉన్నా. ఎలాంటి లక్షణాలు లేవు. టెస్ట్‌కు పోతే నెగిటివ్ వచ్చింది. కానీ ఎందుకైనా మంచిదని హోటల్లో క్వారంటైన్ అయ్యా. 14 రోజులు ఇంటికి వెళ్లలేదు. మరోసారి టెస్ట్ చేయించుకుని ఇంటికి వెళ్లా. హోటల్లో క్వారంటైన్ సేవలు బాగున్నాయి. – శ్రీధర్