
సికింద్రాబాద్, డిసెంబర్ 26: భాగ్యనగర్ వైశ్య యూత్ ఆసోసియేషన్, తెలంగాణ టూరిజం సమన్వయంతో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టా ’ ఆదివారం ఘనంగా ముగిసింది. సెలవు రోజు కావడంతో రెండో రోజైన ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. ఇందులో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున యువత తరలిరావడంతో పరేడ్ మైదానం కళకళలాడింది. హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టాను తిలకించేందుకు నగరం నుంచి భారీ ఎత్తున హాజరయ్యారు. ప్లే జోన్ ప్రాంతం కావడంతో సుమారు 250 అడుగుల మేర హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరవేస్తూ చిన్నారులు కేరింతలు కొట్టారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పడ్డాయి. వీటిని తిలకించేందుకు వచ్చిన ప్రజలు కాసేపు సేదతీరుతూ కనిపించారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్, ప్రధాన కార్యదర్శి కృష్ణచైతన్య, కోశాధికారి లక్ష్మణ్‌తో పాటు పలువురు పేర్కొన్నారు.