న్యూఢిల్లీ: తనదైన ఆటతో బ్యాడ్మింటన్ టోర్నీల్లో సత్తా చాటుతున్న యువ షట్లర్ ఉన్నతి హుడా మరో సంచలనం సృష్టించింది. అతి చిన్న వయసులోనే భారత్ తరఫున ఆసియా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనుంది. మూడు మెగాటోర్నీలకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గురువారం ప్రకటించిన జాతీయ జట్టులో 14 ఏండ్ల ఉన్నతి చోటు దక్కించుకుంది. ఆరు రోజుల పాటు నిర్వహించిన జాతీయ ట్రయల్స్‌లో ఈ హర్యానా షట్లర్ వరుస విజయాలతో ఆసియా టోర్నీకి ఎంపికైంది. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అశ్మిత చాలిహా తర్వాత ఉన్నతి మూడో స్థానంలో నిలిచింది.
మరోవైపు కామన్వెల్త్, ఆసియా క్రీడలు, థామస్ అండర్ ఉబర్ టోర్నీలకు స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, శ్రీకాంత్ సారథ్యం వహించనున్నారు. మెగాటోర్నీల్లో ఒలింపిక్ పతక విజేత సింధు సారథ్యంలో మహిళల బృందం బరిలోకి దిగుతుండగా.. పురుషుల జట్టుకు లక్ష్య, శ్రీకాంత్ నేతృత్వం వహించనున్నారు. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల సింగిల్స్‌లో.. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. మహిళలల్లో సింధు, ఆకర్షి కశ్యప్, డబుల్స్‌లో పుల్లెల గాయత్రి- త్రిష జాలీ, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప-సుమిత్‌రెడ్డి జోడీలు పతకాల వేట సాగించనున్నాయి.
తొలుత బ్యాంకాక్ వేదికగా మే 8 నుంచి ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబర్ కప్ టోర్నీలో మన షట్లర్లు పాల్గొననున్నారు. అనంతరం బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి కామన్వెల్త్ క్రీడల్లో, ఆ తర్వాత చైనాలోని హంగ్జౌ నగరంలో సెప్టెంబర్ 10-25 మధ్య ఆసియా క్రీడలకు హాజరుకానున్నారు. కాగా, ట్రయల్స్ నుంచి వైదొలుగడంతో సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ మెగాటోర్నీలకు దూరమైన విషయం తెలిసిందే. తదుపరి టోర్నీల కోసం ‘బాయ్’ జాతీయ శిక్షణ శిబిరానికి 40 మంది ప్లేయర్ల (పురుషులు 20, మహిళలు 20)ను ఎంపిక చేసింది.
పురుషులు
సింగిల్స్: లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్,
డబుల్స్: సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి
మహిళలు: సింధు, ఆకర్షి కశ్యప్
డబుల్స్: పుల్లెల గాయత్రి- త్రిష జాలీ
మిక్స్డ్ డబుల్స్: అశ్వినీ పొన్నప్ప- సుమిత్‌రెడ్డి
పురుషులు
సింగిల్స్: లక్ష్యసేన్, శ్రీకాంత్, ప్రణయ్, ప్రియాన్షు
డబుల్స్: సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల్- అర్జున్,
విష్ణువర్ధన్ గౌడ్-కృష్ణ ప్రసాద్
మహిళలు
సింగిల్స్: సింధు, ఆకర్షి, అష్మిత చాలిహ, ఉన్నతి హుడా
డబుల్స్: పుల్లెల గాయత్రి- త్రిష జాలీ,
సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప,
తనీషా క్రాస్టో-శ్రుతి