తుర్కయంజాల్ : సాధారణంగా మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేస్తే మున్సిపల్ అధికారులు జరిమానా విధించడం పరిపాటి. తుర్కయంజాల్ (Turkayanjal Municipality) మున్సిపల్ అధికారులు దీనికి భిన్నంగా ఆలోచించి జరిమానాతో కాకుండా సన్మానంతో (Honor) వారిలో మార్పు తీసుకురావాలని వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
మున్సిపల్ పరిధిలో రోడ్డపై చెత్త వేయరాదు అని సూచిక బోర్డులను ఏర్పాటు చేసినా గాని కొందరు సూచిక బోర్డులను ఏర్పాటు చేసిన చోటే చెత్తను వేస్తు అపరిశుభ్రానికి కారణమవుతున్నారు. రోడ్డు అంతా చెత్తతో నిండిపోయి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు జరిమానాలు విధించిన ప్రజలలో మార్పు రాకపోవడంతో రోడ్డుపై చెత్తను వేసిన వారిని గుర్తించి వారిని శాలువాతో సత్కరిస్తున్నారు. దయచేసి మున్సిపల్ పరిధిలో చెత్తను వేయరాదని మున్సిపాలిటిని పరిశుభ్రంగా ఉంచడం పౌరుల బాధ్యత ఎంతో ఉందని గుర్తు చేస్తున్నారు.
ఈ సందర్భముగా మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పౌరుల బాధ్యతగా చెత్తను ఆటోలకు అందజేస్తే మున్సిపాలిటి పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. చెత్తను వేసిన వారికి వారి తప్పు తెలియాలని సన్మానం చేస్తున్నామని వివరించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేస్తే మాత్రం భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, మున్సిపల్ అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.