అమరావతి : తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని గగ్గోలు పెట్టిన కూటమి నేతలు రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita ) పీఏ టీటీడీ (TTD ) సిఫార్సు లేఖలను అమ్ముకున్న వ్యవహారంపై స్పందించాలని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
సనాతన ధర్మంపై మాట్లాడే అర్హత కూటమి నేతలకు లేదని విమర్శించారు. ముచ్చెర్ల గ్రామంలో వందకు వందశాతం టీడీపీ సభ్యత్వం (Member ship) నమోదు అనేది పచ్చి అబద్ధమని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ గ్రామంలో తమ పార్టీకి పూర్తి మద్దతు ఉందని ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. ముచ్చెర్ల గ్రామంలో వైసీపీ బలంగా ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాల కోసమంటూ ప్రజల వద్ద నుంచి ఆధార్ కార్డులను తీసుకుని సభ్యత్వం నమోదు చేసుకుని మోసం చేశారని ఆరోపించారు. గ్రామంలో వందల ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయని అన్నారు.