సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు నుంచి గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డును కలుపుతూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ 33 రేడియల్ రోడ్లను ప్రతిపాదించారు. వాటిలో ఇప్పటికే మెజారిటీ పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
కొత్తగా మరో రెండు రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు మొదలు పెట్టింది. తాజాగా, నగరానికి తూర్పు వైపు ఉన్న ఉప్పల్ – నాగోల్ ఇన్నర్ రింగు రోడ్డు మూసీనదికి ఇరువైపులా సుమారు 14 కి.మీ దూరం వరకు రేడియల్ రోడ్డు నంబర్లు 20, 21లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న జాతీయ రహదారులైన వరంగల్ – హైదరాబాద్, ఎల్బీనగర్ – విజయవాడల మార్గాలు మినహాయిస్తే విశాలమైన రోడ్డు నెట్వర్క్ ఔటర్ రింగు రోడ్డు వరకు లేదు.
మరోవైపు ఉప్పల్ – నాగోల్ ప్రాంతాల తూర్పు వైపు, ఔటర్ రింగు రోడ్డు నివాస ప్రాంతాలు గడిచిన నాలుగు నుంచి ఐదేండ్లలో గణనీయంగా పెరిగాయి. దీంతో ఇన్నర్ రింగు రోడ్డు నుంచి కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలను కలుపుతూ మూసీ నదికి ఇరువైపులా రెండు రేడియల్ రోడ్లను నిర్మించే ప్రతిపాదను హెచ్ఎండీఏ ప్రభుత్వం ముందుంచింది. ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెండు రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉందని ఓ అధికారి తెలిపారు.
ఉప్పల్ భగాయత్‌తో అనుసంధానం..
ఉప్పల్ – నాగోల్ ఇన్నర్ రింగు రోడ్డును ఆనుకొని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లే అవుట్లో మూసీనది పొడవునా 100 అడుగుల విస్తీర్ణంలో రోడ్డును నిర్మించారు. దానికి అనుసంధానంగానే రేడియల్ రోడ్డు 20ని ఉప్పల్ భగాయత్ లే అవుట్ నుంచి ఫీర్జాదిగూడ, పర్వత్‌నగర్, ప్రతాప సింగారం, కొర్రెముల వరకు మొదటి దశలో నిర్మించనున్నారు. అదే విధంగా మూసీకి దక్షిణ వైపు మరో రేడియల్ రోడ్డును నాగోల్ నుంచి గౌరెల్లి వరకు నిర్మించేందుకు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు.
నెట్‌వర్క్‌తో వేగంగా అభివృద్ధి..
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను మినహాయిస్తే దాని చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్ల నిర్మాణంపై హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్తగా వెలుస్తున్న నివాస ప్రాంతాలు, పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చినట్లుగా రోడ్లను నిర్మించేందుకు దశల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం, నగరం తూర్పు దిశగా నివాస ప్రాంతాలతో పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో మెరుగైన రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.