సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ చేపట్టిన కూల్చివేతలు అక్రమ నిర్మాణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఐదు రోజులుగా మహా నగర వ్యాప్తంగా నిరంతరాయంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అక్రమ నిర్మాణాలను పట్టించుకోని మునిసిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నగర శివారులోని పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ కమిషనర్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకోగా, మీర్‌పేట మునిసిపల్ కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గ్రేటర్ చుట్టూ, ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తూనే ఉన్నారు.
తాజాగా శనివారం 5వ రోజు 22 నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 66 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, మరో 16 నిర్మాణాలను సీజ్ చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ, టాస్క్‌ఫోర్స్ యంత్రాంగం సీజ్ చేసిన వాటిలోఆదిభట్ల మునిసిపాలిటీ పరిధిలో ఒక రెడీమిక్స్ సిమెంట్ ప్లాంట్, ఒక క్రషర్ ప్లాంట్ ఉన్నాయి. అదే విధంగా నార్సింగి మునిసిపాలిటీ పరిధిలో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును ఆనుకొని నిర్మించిన ఒక పెట్రోల్ బంకును స్వాధీనం చేసుకున్నారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 3, గుండ్ల పోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలో 4, నార్సింగి మునిసిపాలిటీ పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు.