హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యను ప్రైవేటీకరించడంలో తమకెవరూ సాటిరారని బీజేపీ నిరూపించుకుంటున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ప్రైవేట్ యూనివర్సిటీలు ఎక్కువగా ఉన్నాయి. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు, విద్యా వ్యాపారం వేగవంతమయ్యాయి. దేశంలో ప్రస్తుతం 397 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండగా ఇందులో 210 ప్రైవేట్ వర్సిటీలు 2014 తర్వాత ఏర్పాటైనవే కావడం ఉన్నత విద్య వ్యాపారీకరణ పట్ల బీజేపీకి ఉన్న మమకారాన్ని ఎత్తి చూపుతున్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 220, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలిత రాష్ర్టాల్లో మరో 25 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో దేశంలోనే అత్యధికంగా 52 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ 50 ప్రైవేట్ వర్సిటీలతో రెండో స్థానంలో నిలిచింది. దేశంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 442 ఉన్నట్టు యూజీసీ నివేదిక పేర్కొన్నది.