ధర్మపురి, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఆ దిశగా ముందుకు సాగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని 91 పాఠశాలలు తొలి విడుతలో గుర్తించారు. ఈ మేరకు బుధవారం ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి జగిత్యాల కలెక్టర్ రవితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి నుంచి దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా రూపాంతరం చెందిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కూడా దేశానికి ఆదర్శం కానున్నదని ఉద్ఘాటించారు. పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు నూతన ఒరవడిని సృష్టించబోతున్నదని చెప్పారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుం డా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఇందులో పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ బడుల్లో చదువుకొని ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధ్ది చెందిన పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని అందించేలా క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలన్నారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 9,123 పాఠశాలల్లో 12 రకాల కనీస సౌకర్యాలను కల్పించేందుకు రూ.3,497 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, పర్యవేక్షించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి 8న సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, అదే రోజు ఇక్కడి పాఠశాలల్లో కూడా వేడుకలు నిర్వహించాలని సర్పంచులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, కార్యక్రమం అమలుకు ప్రతి మండలానికి ఇంజినీరింగ్ ఏజెన్సీని కేటాయించామని, సదరు ఇంజినీర్లు పరిశీలించి 12 అంశాల్లో చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందిస్తారని చెప్పారు. పాఠశాల అభివృద్ధి, నిర్వహణ కోసం సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు పూర్వ విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జగిత్యాల జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, పెద్దపల్లి ఇన్చార్జి విద్యాధికారి విజయ్‌కుమార్, ఎంఈవోలు దాసరి భూమయ్య, జమునాదేవి, శ్రీనివాస్, ఛాయాదేవి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉన్నారు.