హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కొడుకు సాయిభగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నది. ఉభయపక్షాల వాదనలు విన్న తరువాతే మధ్యంతర ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడుతామని తెలిపింది. పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో నమోదైన పోక్సో కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని భగీరథ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ టీ మాధవీదేవి గురువారం విచారణ ప్రారంభించారు. ఈ కేసులో పిటిషనర్ భగీరథ్ ఏమైనా ప్రత్యేకమా అని ప్రశ్నించారు. ‘మీకు ఎందుకు రక్షణ కల్పించాలి. ఇతరులకంటే ప్రత్యేకత ఏమైనా ఉందా? మీరు కూడా ఇతర నిందితులతో సమానమే.. మీ కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలి. పోక్సో కేసులో బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయవచ్చా అన్నది కూడా చెప్పాలి’ అని స్పష్టం చేశారు. పోక్సో కేసు వర్తించదని వాదన చేస్తున్నవారు అందుకు సంబంధించిన ఆధారాలు చూపి నేరుగా వాదనలు వినిపించాలని చెప్పారు.
భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కేసును కొట్టివేయాలని కోర్టును కోరడం లేదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అరెస్టు నుంచి కోర్టు తాతాలిక రక్షణ కల్పిస్తే వెంటనే పోలీసుల ఎదుట హాజరై దర్యాప్తునకు సహరిస్తామని తెలిపారు. ఎఫ్ఐఆర్లో మొదట నమోదుచేసిన అభియోగాలు ఏడేండ్లలోపు శిక్ష విధించే సెక్షన్లకు సంబంధించినవని, ఆ తర్వాత మరిన్ని సెక్షన్లు చేర్చి కేసును తీవ్రతరం చేశారని ఆరోపించారు. అర్నేశ్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేండ్లలోపు శిక్ష ఉన్న కేసుల్లో అరెస్టు చేయరాదని అన్నారు. బాధితురాలి వయసుకు సంబంధించి సందేహం వ్యక్తం చేశారు. ఒక జనన ధ్రువీకరణ పత్రంలో 2008గా, మరొకదానిలో 2010గా నమోదై ఉన్నదని చెప్పారు. అలాగే 2021లో నిర్మల్‌లో నమోదైన డ్రైవింగ్ కేసులో బాధితురాలి వయసు 15 ఏండ్లుగా నమోదు చేశారని, ఆ లెకన ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు అనగా మేజర్ అవుతుందని వాదించారు. ఒకవేళ మైనర్ అయినప్పటికీ నాలుగు నెలలు ఆలస్యంగా ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్, బాధితురాలు రిలేషన్షిప్లో ఉన్నట్టు పేరొన్నారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది జూన్‌లో వారి పరిచయం మొదలై డిసెంబర్ చివర్లో విభేదాలు వచ్చాయని ఫిర్యాదులో ఉన్నదని గుర్తుచేశారు. జనవరి ఒకటిన ఘటన జరిగిందని చెప్తూ మే 8 వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండటాన్ని తీవ్ర జాప్యంగా పరిగణించాలని కోరారు. కేసు తీవ్రతను తాము తగ్గించి చూపడం లేదని, అయితే నిందితుడి హకులను కూడా కోర్టు రక్షించాలని కోరారు. కేసు మెరిట్స్‌లోకి వెళ్లకుండా, అరెస్టు నుంచి మాత్రమే రక్షణ కోరుతున్నామని విజ్ఞప్తిచేశారు. దర్యాప్తునకు వెళ్లిన వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నందున మ ధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చే యాలని కోరుతున్నట్టు చెప్పారు.
బాధితురాలి తల్లి తరఫున సీనియర్ న్యా యవాది పప్పు నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. పోక్సో కేసుల్లో నిందితులకు రక్షణ క ల్పించరాదని పేరొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ల ప్రకారం ఆరోపణలు ఎదురొంటున్న నిం దితుడు అరెస్టు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే ఇప్పటివరకు అరెస్టు కాలేదని ఆరోపించారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ వెంటనే స్వీకరించలేదని, ఇదే సమయంలో పిటిషనర్ కరీంనగర్ పీఎస్‌లో బాధితురాలిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. బాధితురాలు 2008లో పుట్టినా, 2010లో పుట్టినా మైనరేనని తెలిపారు. పిటిషనర్ పరారీలో ఉ న్నందున అత్యవసరంగా మధ్యంతర బెయిల్‌పై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమ యం ఇవ్వాలని, కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు.
విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మధ్యంతర బెయిల్ ఇస్తే.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. ప్రతి క్రిమినల్ ఇలాగే చెప్తాడని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి అభ్యంతరం చెప్పా రు. ఆరోపణలు రుజువు కాకముందే క్రిమినల్‌గా చిత్రీకరించడం చట్టవిరుద్ధమన్నారు. వా దనలపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఇ రుపక్షాలు సంయమనం పాటించాలని కోరా రు. నిందితుడైన పిటిషనర్‌ను నేరస్తుడిగా పే రొనడాన్ని తప్పుపట్టారు. బాధితురాలి వయసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి.. మొదట నమోదు చేసిన సెక్షన్లను తర్వాత ఎందుకు మార్చారని పోలీసులను ప్రశ్నించారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు స్పందిస్తూ.. బాధితురాలి 161 స్టేట్మెంట్ నమోదు చేసిన తర్వాతే కేసులో కొత్త సెక్షన్లు చేర్చామని తెలిపారు. తొలుత సెక్షన్ 11, 12 నమోదు చేశారని, తర్వాత 5, 6 సెక్షన్లను చేర్చారని తెలిపారు. ఈ నెల 8న రాత్రి బాధితురాలి తల్లి ఫిర్యాదు ఇవ్వగా, తదుపరి రోజు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం అభియోగాల్లో మార్పులు చేసినట్టు వివరించారు.