హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62లో నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం లేదా అధికారులు ఏవైనా చర్యలు చేపట్టాలనుకుంటే తప్పనిసరిగా చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టంచేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలుచేసే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. కేసు విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.
ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. బహదూర్‌గూడ గ్రామానికి చెందిన ఆర్ కృష్ణమోహన్రాజుతోపాటు మరో 84 మంది రైతులు ఒక పిటిషన్, ముస్తాంగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 18న తెల్లవారుజామున పోలీసులు, రెవెన్యూ అధికారులు భారీ బలగాలతో వచ్చి ఇండ్లను కూల్చివేసి, రైతులు, మహిళలను బలవంతంగా ఖాళీ చేయించారని, తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి ఇప్పటికే ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని, తమ ప్రాథమిక హకులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది హనుమంతరావు వాదనలు వినిపిస్తూ, కూల్చివేసిన నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలని, ఒకో రైతుకు రూ.2 కోట్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
తెల్లవారుజామున మహిళలపై, రైతులపై విచక్షణారహితంగా దాడులు చేసి ఖాళీ చేయించారని పేరొంటూ మొత్తం ఘటనపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోర్టును అభ్యర్థించారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ భూములు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అవసరమైన సుమారు 650 ఎకరాలలో భాగమని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి భూముల యాజమాన్య హకులకు సంబంధించిన తీవ్ర వివాదాస్పద అంశాలు ఉన్నాయని పేరొన్నారు. పిటిషనర్ల హకుల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు ప్రస్తుతమున్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.