హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, భైంసాల్లో నిర్వహించే శోభాయాత్రల విషయంలో పోలీసులు జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని నిర్వాహకులకు హైకోర్టు ఉత్తర్వు లు జారీచేసింది. హైదరాబాద్‌లో శోభాయాత్రను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అనుమతించిన వీధుల్లో తప్ప ఇతర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించడానికి వీలులేదని హైకోర్టు స్పష్టంచేసింది. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ నెల 7న శోభాయాత్రకు మార్గదర్శకాలు జారీచేశారని ప్రభుత్వ న్యాయవాది టీ శ్రీకాంత్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.