వరంగల్ లీగల్, డిసెంబర్ 11: మానవాళికి ప్రాణవాయువు అందించి, పర్యావరణ సమతుల్యతకు పాటుపడే మొకలను నాటడం మన బాధ్యతని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు పేరొన్నారు. శనివారం హనుమకొండ జిల్లాలోని కోర్టు ఆవరణలో నిమిషంలోనే 200 మొకలు నాటారు. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్‌రావు మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతోనే సరి పెట్టకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. నిత్యం వందల మంది కక్షిదారులతో కిటకిటలాడే కోర్టు ఆవరణలో ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేయడానికి బార్ అసోసియేషన్ బాధ్యులు ఆలోచన చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, అదనపు జిల్లా జడ్జి జయకుమార్తోపాటు జిల్లాలోని న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.